Home సద్గురు కృప అవతరించిన మహాపర్వదినం

సద్గురు కృప అవతరించిన మహాపర్వదినం

by

Loading

మనం ఎవరమైనా, ఎలాంటి వారమైనా, మన జీవితంలో గురువు అత్యంత అవసరం. గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకున్నా వర్తమానాన్ని గమనించినా, భవిష్యత్తును తలుచుకున్నా ఇదంతా ఒక సాకార ప్రశ్నలాగా గోచరిస్తుంది. జీవన సార్ధకతకు మనకు దిశ, ఉద్దేశ్యం, లక్ష్యం చాలా అవసరమని ఈ ఆత్మ సమీక్షలో తేలుతుంది. వీటిలో ఏది లేకపోయినా మన జీవితమంతా అడ్డదోవ పట్టినట్టే. చాలా వరకు జీవితాంతం ఏవేవో సుఖాల్లో సార్థకతను వెతుక్కునే ప్రయత్నం చేస్తూంటాము, చివరికి ఈ సుఖాలన్నీ భ్రమే అని గుర్తించి ముసలితనంలో మోసపోయామని తెలుసుకుంటాం. ఇప్పటివరకు చేసింది, సంపాదించింది అంతా అనవసరమైనవి, అర్ధం లేవని అనిపిస్తుంది.

జీవితాంతం ఒక్కక్షణం కూడా తీరిక దొరకలేదు, ప్రశాంతత లేదు అంటూనే ఉంటాం. తెలిసో తెలియకో దేన్నో వెతుకుతూ ఉంటాం. ఎన్నో తలుపులు తడుతూ ఉంటాం, కాని ఏదీ సాధించం. డబ్బు, ప్రతిష్టల కోసం వెంపర్లాడుతూ ఉంటాం. అవి దొరికినా కూడా తృప్తి కలగదు, సంతోషం రాదు. మనం ఊహించుకున్న సుఖ సంతోషాలు, సాఫల్యం పొందడానికి కావలసిన వస్తువులన్నీ అందం, ఐశ్వర్యం, మొదలైనవన్నీ దొరికినా కూడా ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. దొరికినవన్నీ పోతాయనే భయం, ఏకాంతంగా ఉన్నప్పుడు వృద్ధాప్యం, మృత్యువు దగ్గరపడుతున్నాయనే భయం. ఈ వ్యాకులత మనస్సును, మస్తిష్కాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేస్తుంది…. సర్వసామాన్యంగా అందరూ ఇలా తప్పుదోవపట్టే వాళ్ళే.

జ్ఞానులు మాత్రమే జీవన సందేశాన్ని అర్ధం చేసుకుంటారు. భౌతిక సుఖ సంతోషాలే కాక అవసరమైన వస్తువులు చాలా ఉన్నాయని అటువంటి వారే భావిస్తారు. ఈ జ్ఞానం వారిని అంతర్ముఖుల్ని చేయడం వల్ల వారు మరింత అర్ధవంతమైన సంబంధాలను వెతుకుతారు. ఈ జ్ఞానమే వారిని అంతరాత్మను వెతకాలని ప్రేరేపిస్తుంది. అప్పుడు గాని ఈ జగత్తు, గుణాలు అసలు సమస్యలు కావని, నిజమైన సమస్య మనలోనే ఉందని తెలుస్తుంది. మన సామాన్య జీవనశైలి ద్వారా ప్రాపంచిక వస్తువులు నిత్యమైనవని, పరివర్తనా రహితమైనవని, అత్యవసరమైనవని నిరూపించడానికి ప్రయత్నిస్తూంటాము. కాని నిజానికి అది మన దృష్టికోణంలోని దోషం. ఈ ప్రపంచంలో స్థిరత్వం, జడత్వం అనేది అసలు లేదు. ఈ ప్రపంచమంతా నిరంతరం తిరుగుతూనే ఉన్నది. సృష్టి స్థితి, లయం ఇవి ప్రకృతి నియమాలు. మనలో ఎవ్వరమూ దీన్ని ఆపలేము. అయినప్పటికి పూర్ణమైనది, అనంతమైనది, శాశ్వతమైనది అయిన మరో తత్త్వం మనకు అందుబాటులో ఉంది. ఈ తత్త్వం స్వయంగా మనలోనే నెలకొని ఉన్నది. దీని కోసం బయటెక్కడో వెతకవలసిన అవసరం లేదు. జ్ఞానులు దీన్నే ఆత్మ అన్నారు. పరమసత్యమైన ఈ ఆత్మ మనకు శాశ్వత సుఖాన్ని అందించడానికి ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఈ నిరంతర ఆహ్వానాన్ని మనం మన్నించకపోవడానికి ఒకే ఒక కారణం సద్గురువు లేకపోవడం.

అంతరాత్మను చేరుకునే ఈ దారి పెద్దది, కష్టాలతో నిండినది, కత్తి మీద సాము వంటిది, అదృశ్య ఆపదలతో నిండినది. ఇటువంటి దారి గురించి మనకేం తెలుస్తుంది? ఆపదలతో నిండిన ఇంత పెద్ద తోవలో ఎలా ప్రయాణించాలి అనేది కాదు ప్రశ్న అసలు లక్ష్యం ఏంటి అనేదే మనకు తెలియదు. అందుకే గోస్వామి తులసీదాసు, “గురు బినా హోహీ న జ్ఞాన్‌” (గురువు లేకపోతే జ్ఞానం లేదు) అన్నారు. గురుశిష్య సంబంధాలను కనుక్కున్న మహాత్ములకు ప్రాపంచిక, సామాజిక సంబంధాల ప్రాపంచిక పూర్ణజ్ఞానం ఉండేది. సామాన్య వ్యక్తి మనకెంత దగ్గరి బంధువైనా మనకు మార్గదర్శకుడు మాత్రం కాలేడు. ప్రాపంచిక దృష్టిలో అతనికి డబ్బు, హోదా, పరపతి లేకపోయినా పరమ ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడు అయిన వ్యక్తి గురువుగా అవసరం.

చాలా మంది అసలు గురువు అవసరం లేదు, నిజమైన గురువు మనలోనే ఉన్నాడని వాదిస్తూంటారు. సిద్ధాంతపరంగా ఇది నిజం కూడా. కాని అంతఃకరణలో నెలకొని ఉన్న సద్గురువు మాటను మనలో ఎంతమంది వినగలం, అర్ధం చేసుకోగలం, అర్ధం చేసుకుని ఆచరించగలం? మానవుని మనస్సు వాసనలు, కోరికలు, ఆకాంక్షల సంగమం. ఇంతటి అలజడిలో అంతఃకరణలోని సద్గురువాణి వినడం ఎంత వరకు సంభవం? అది ప్రశాంతమైన నిశ్చలమైన వాణి. నిశ్చలమైన ఆ వాక్కులు వినాలంటే ముందు మనలోని కోలాహలాన్ని రూపుమాపాలి. కాని మనస్సు యొక్క స్వాభావిక సంరచనను కూడా మనం అర్థం చేసుకోలేం. ఆసక్తి, కోపం, ఈర్ష్య, ద్వేషం, వాసనలు అసలెందుకు వస్తాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ కోలాహలాన్ని ఎంత అణిచివేయాలని చూస్తే అంత తీవ్రంగా తిరిగి వినిపిస్తూంటుంది.

ఈ ఆంతరిక అశాంతిని పోగొట్టుకోవటానికి మనకు గురువు చాలా అవనరం. శరీరం, మనన్సు, అంతరాత్మలను నియంత్రించగలది వారొక్కరే. మన ఆత్మవికాసానికి అడ్దువచ్చే నకారాత్మక (నెగిటివ్) మానసిక ప్రవృత్తులను తొలగించుకునే మార్గం వారొక్కరే మనకు చూపించగలరు. గురువు వెలుగుతున్న జ్ఞాన కాగడ. భౌతిక శరీరధారి అయినప్పటికీ వారి ఆత్మ ఉన్నతమైన అజ్ఞాత జగత్తులో విహరిస్తూంటుంది. వారు తమ కోసం కాక మన కోసం ఈ పృథ్వితో సంబంధం పెట్టుకుంటారు. వారికి స్వార్ధం ఉండదు. వారికి కోరికలూ ఉండవు. కాంక్షలూ ఉండవు. గురువే జీవితానికి పూర్ణత్వాన్నిస్తారు. వారు స్వయంగా పవిత్ర, శాంత, ప్రేమ, జ్ఞాన స్వరూపులు. వారు సాకారులు, నిరాకారులు కూడా. దేహధారి అయిన్పటికి దేహాతీతులు. దేహాన్ని త్యాగం చేసినా వారి అస్తిత్వం చెరగదు సరికదా,ప్రఖరమవుతుంది. వారిని పొందటానికి, వారిని కలవడానికి కావలసినదల్లామన కోరిక. మనస్సు నుండి తీవ్రంగా వెలువడే పిలుపు. మన గురుదేవులు మనకు దూరంగా లేరు అనే సందేశాన్ని అందిస్తున్నది గురుపూర్ణిమ. దేహధారిగా ఉన్నప్పుడు కూడా వారు దేహాతీతులే, ఇక దేహాన్ని త్యజించాక సర్వవ్యాపకులైపోయారు. ఆయన్ని పిలిచినవారికి ఆయన వరాలు తప్పక లభిస్తాయని మనకు భరోసా ఇచ్చారు.

మనం జీవితంలో ఎలాంటి భూమికను నిర్వర్తిస్తున్నా సరే, ధనవంతులమైనా, పేదవారమైనా, సుఖంగా ఉన్నా దుఃఖాలలో ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా రోగులమైనా, చైతన్యం వికసించినా, వికసించకపోయినా, మనలోని ప్రతి ఒక్కరికోసం గురువుగారి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. మనలోని ప్రతి ఒక్కరి కోసం ఆయన దగ్గర ఏదో ఒక సందేశం ఉంది. జీవితాంతం ఎలాంటి కష్టాలూ అనుభవించని వాడు కూడా ఏదో ఒక సమయంలో నిరాశ, అసంతృప్తి, వెలితి అనిపించిన క్షణాలులేవని చెప్పలేడు.

మన జీవితాలలోని ఈ వెలితిని నింపాలని గురుదేవులు సంకల్పించారు. శ్రద్ధాపూర్వకంగా మన జీవితాలలోకి తపోమూర్తి గురుదేవులను ఆహ్వానిస్తూ, వారి కృపను అవతరింపజేసుకునే పర్వదినమే గురుపూర్ణిమ.

– అఖందజ్యోతి, జూలై 2000

యుగశక్తి గాయత్రి – జూలై 2011