క్షణంలోనే శాశ్వతత్వం దాగి ఉంది. అలాగే అణువులోనే విరాట్ స్వరూపం ఇమిడి ఉంటుంది. అణువుని అణువే కదా అని వదిలివేస్తే విరాట్‌ను కోల్పోతాము. ఒక్కక్షణమే కదా అనుకొని క్షణాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి శాశ్వతత్వంతో తన సంబంధాన్ని త్రుంచేసుకుంటాడు. అల్పమైనదానిని హేయంగా భావించడం తప్పు. ఎందుకంటే ఇదే ఆ పరమాత్ముడిని
చేరుటకు మార్గము. దీనిని లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకొనగలిగినవారు పరమపదాన్ని పొందలరు.
జీవితంలో ప్రతి ఒక్కక్షణం మహత్వపూర్ణమైనదే! ప్రతి ఒక్కక్షణం యొక్కవిలువ మరి ఏ ఇతర క్షణం యొక్క విలువకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆనందాన్ని పొందుటకు ఏదో ఒక ప్రత్యేకమైన సమయం కోసం ఎదురుచూడటం వ్యర్థం. ఈ విషయాన్ని తెలుసుకున్నవారు ప్రతి నిమిషాన్ని ఆనందమయం కావించుకుంటారు.
ఏదో ఒక ప్రత్యేక సమయం కోసమో లేదా ప్రత్యేక సందర్భం కోసమో ఎదురుచూసేవారు మొత్తం జీవితంలోని సమయాన్నంతటిని, అవకాశాలనన్నింటిని కూడా పోగొట్టుకుంటారు. ప్రతి ఒక్క బిందువు, సచ్చిదానందమనే సాగరంలోని అమృతపు అంశ, అలాగే ప్రతి ఒక్క క్షణము అనంతమైన శాశ్వతత్వం యొక్కసనాతన అంశ. ఈ రెండింటిని హృదయంగం చేసుకుని ఆచరించగలిగిన వ్యక్తియే అమరత్వమునురుచి చూడగలుగుతాడు. నీటి యొక్క బొట్టు బొట్టు కలిసి సముద్రమైనట్లే క్షణక్షణం కలిసి జీవితమౌతుంది. నీటిబొట్టును గుర్తించగలిగేవాడు సముద్రాన్ని గురించి తెలుసుకొనగలడు. అదే విధంగా క్షణాన్ని విలువైనదిగా తెలుసుకొనగలిగినవాడు జీవితం యొక్క విలువను గ్రహించగలుగుతాడు. ‘క్షణంలో శాశ్వతత్వమును తెలుసుకొనగలగటమే ఆధ్యాత్మిక రహస్యం.
*యుగ శక్తి గాయత్రి పత్రిక జూన్ 2018*