సాధన తరువాత మీకు చెప్పవలసిన విషయం ఆరాధనను గురించి. “ఆరాధన అంటే ఏమిటి? ఎవరిని ఆరాధించాలి?” అంటే సంఘసేవ లేదా ప్రజాహితాన్నే ఆరాధన అంటారు. సేవాధర్మంలో అంతా రొక్కబేరమే! అప్పటికప్పుడే ఫలితం వచ్చేస్తుంది. ఇందులో ముందుగా మీరు నాటుకోవలసివుంటుంది. ఇప్పటికి 60 సంవత్సరాల క్రితం మా గురుదేవులు స్వయంగా మా ఇంటికి వచ్చి, మాకు దీక్షనిచ్చి ఆ తరువాత నీవు నాటడం – కోసుకోవటం” అన్న అంశాన్ని మరచిపోవద్దు – అని ప్రబోధించారు. మనం ఏ విత్తనమైనా సరే ఒక్క గింజను నాటితే అది వేలాది గింజలను తిరిగి మనకు ఇస్తుంది. (ఉదా: మొక్కజొన్న) అలాగే సజ్జనులు కూడా! ఏ వస్తువూ ఎక్కడ నుండీ పూరికే లభించదు. గురువైనా సరే, భగవంతుడైనా సరే మనం నాటుకున్న దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు. శ్రమపడకుండా ఉచితంగా తినడం, అడుక్కోవటం మానేసి ‘నాటుకొని – కోసుకోవటం” అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే మీకు మేలు కలుగుతుంది’ అని కూడా వారు మాకు బోధించారు.
ఇందుకోసం వారు మాకు ఒక పద్ధతిని సూచించారు. ’24 సంవత్సరాల పాటు గాయత్రీమంత్ర పురశ్చరణ చెయ్యాలి. ఆ సమయమంతా ఆహారంగా కేవలం బార్లీగింజలతో చేసిన రొట్టే, మజ్జిగ మాత్రమే తీసుకోవాలి.” ఇదే గురుదేవులు మాకు నిర్దేశించిన పద్ధతి. వారు సూచించిన విధానాన్ని మేము చాలా జాగ్రత్తగా పాటించాము. ఇందులో మరో కొత్త మార్గాన్ని కూడా చెప్పారు. అదే “నాటు – కోసుకో” అనబడే సూత్రం. నీ దగ్గర ఏదైతే వుందో ముందర దానిని భగవంతుని పొలంలో నాటుకో! అని.
భగవంతుడు మనకు “శరీరము, బుద్ధి, భావనలు” అనబడే మూడు అంశాలను ప్రసాదించాడు. ఇవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు ప్రతీకలు. స్థూలశరీరానికి శ్రమ, సమయము – సూక్ష్మశరీరానికి మనస్సు, బుద్ధి – ఇంక కారణ శరీరానికి ఆలోచనలు అంగములుగా ఉంటాయి. ఇంక నాల్గవది అయిన ‘ధనము, సంపద’ అనేవి మనిషి సంపాదించుకో గలిగినవి. భగవంతుడు ఎవ్వరినీ పుట్టుకతోనే పేదవానిగానో, ధనవంతునిగానో జన్మింపచెయ్యడు. ఇవి మీకు మీరుగా స్వయంగా కృషిచేసి పొందగలిగినవి. వీటినే మీరు నాటుకోవలసివుంటుంది.
ఎక్కడ నాటుకోవాలి అంటే భగవంతుని పొలంలో! అంటే ఈ యావత్ ప్రపంచమంతా భగవంతుని పొలమే! ఆయన విరాట్ స్వరూపుడు. ఆయనను విరాట బ్రహ్మ అంటారు. ఆ స్వరూపమునే శ్రీకృష్ణుడు అర్జునునికి దివ్యచక్షువుల నిచ్చి దర్శింపజేశాడు. కౌసల్య కూడా ఆ విరాట్ బ్రహ్మ స్వరూపమునే దర్శించింది. కాబట్టి ఏమి చెయ్యదలుచుకున్నావో అది ఈ యావత్ సృష్టికి ఉపయోగపడే విధంగా చెయ్యమని మా గురుదేవులు చెప్పారు. ఇదే భగవంతునికి నిజమైన పూజ. దీనినే ఆరాధన అంటారు. నీవు కూడా ఈ విరాట్ విశ్వంలో ‘నాటుకో’ అంటే ప్రజలకు సేవ చెయ్యి. ప్రజలకు హితం చేకూర్చటానికి, వారిని ఉన్నత స్థితికి చేర్చటానికి, సమున్నతులుగా, సుసంస్స తులుగా తయారుచెయ్యటానికి నీకున్న సమస్త శక్తులను, సంపదలను వినియోగించు. మున్ముందు అది వందరెట్లుగా తిరిగి నీ వద్దకు వస్తుంది. నీ దగ్గర ఏ కొంచెం ఉన్నా సరే… దానిని వినియోగించు. రిధులు, సిద్ధులు నీ హస్తగతమై తీరుతాయి. ఇవన్నీ నీ చుట్టూ తిరుగుతాయి అని ఆదేశించారు మా గురుదేవులు.
మేము కూడా దృఢనిశ్చయంతో ఇందుకు సన్నద్దుల మైనాము. మేము సూర్యోదయానికి ముందే భగవంతుని పూజ, అర్చన చేసేవారము. మిగిలిన సమయమంతా ఆయన పనిలో నిమగ్నమయ్యేవారము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉన్న సమయాన్నంతా భగవంతుని కోసమే అంటే సమాజము కోసమే వినియోగించేవారము.
రెండవది బుద్ధి! అదీ మా వద్ద ఉన్నది. రునాడు బనమంతా బుద్ధిని అంటే తెలివితేటలను ఎటువంటి చెడ్డపనులలో వినియోగిస్తున్నారో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. నేటి ప్రజలు తమకున్న తెలివిని కలీ చెయ్యటం, దొంగతనం, చెయ్యకూడని అన్యాయపు పనులను చెయ్యటానికి ఉపయోగిం చుకుంటున్నారు. మేము మా బుద్ధిని సన్మార్గము వైపుకు నడిపించుకొనటానికీ, తద్వారా సమాజము, దేశము… ఈ రెండింటినీ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి మాత్రమే ప్రయత్నించాలని దృఢనిశ్చయం చేసుకున్నాము. కాబట్టి మేము మా బుద్ధిని, తెలివితేటలను సంపూర్ణంగా భగవంతుని పనులలోనే నియోగించాము.
ఇక మా వద్దనున్న మూడవ అంశము ఆలోచనలు, భావసంవేదనలు! వీటిని కూడా మేము కుటుంబసభ్యుల కోసమో, సోదరీసోదరుల కోసమో వినియోగించలేదు. మేము భావనలను, సంవేదనలను ఈ ప్రపంచంలో అర్హులైన, బాధితులైనవారి దు:ఖాన్ని నివారించటానికి మాత్రమే సర్వదా ఉపయోగించాము. ‘మా వద్ద కొంత సంపద ఉన్నది. దానిని అర్హులైన వారికి మాత్రమే పంచిపెట్టగలము. ఫలానా వ్యక్తులు ఎంత దు:ఖములో ఉన్నారు ? వారి వేదనను ఏవిధంగా తొలగించగలము?” అని ఆలోచించి మా జీవితకాలమంతా పై రెండు పనుల కోసమే వెచ్చించాము. ఇవి కాకుండా ఇంకా ఏమైనా సంపద మిగిలివుంటే దానిని కూడా భగవంతునికి సమర్పించాము.
ఇలా చెయ్యటం వలన బదులుగా ఎంత లభించింది అనేది బహుశః మీకు చెప్పలేము. ప్రజలు మమ్మల్ని ఎంత
ప్రేమించారో మీకు తెలియదు. ఇక్కడకు వచ్చిన ప్రజలు ఎవరైనాగానీ ‘గురువుగారి దర్శనం లభిస్తే బావుండును’ …అని తహతహలాడుతుంటారు. ఇదంతా ఏమిటంటే ప్రేమ. మేము వారికి ప్రేమను, ఆప్యాయతను అందించాము. తిరిగి అదే ప్రేమను అంతకన్నా అధిక మోతాదులో వారి నుండి పొందగలిగాము. ఎందరో మహాత్ముల జీవితంలో కూడా ఇదే సంభవించింది. మేము ఇంకా ఎక్కువగానే పొంద గలిగాము. ప్రజలు సాధారణంగా ఎంతోమంది వ్యక్తులను వారు మరణించిన తరువాత పూజిస్తూవుంటారు. బుద్ధ భగవానుణ్ణి పూజిస్తున్నారు. “శ్రీకృష్ణ భగవాన్ కీ జై” అని
శ్రీరృష్ణుడు నిర్యాణం చెందిన తరువాత బయటయరారాలు చేస్తున్నారు. కానీ ఆయన జీవించి ఉన్నప్పుడు దుర్యోధనాదులు ఆయనను ఎంతో నిందించారు. మేము దేహం చాలించిన పిదప జనం మాకు హారతుల నిస్తారో, ప్రేమిస్తారో చెప్పలేను కానీ… ఇదే మేము నమ్మి, జీవితమంతా ఆచరించిన “నాటుకోసుకో” అనబడే సిద్ధాంతం. ఇదే మేము సమాజానికీ, భగవంతునికి సమర్పించుకున్న ఆరాధన! మేము రాతి విగ్రహానికి కాకుండా సమాజం కోసం పనిచేశాము. “సమాజమే భగవంతుడు” అన్న భావనతోనే పనిచేశాము.
ఇద్దరు తోటమాలుల కథను మేము ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటాము. ఒకానొక రాజు ఉండేవాడు. ఆయన ఒక తోటమాలికి ఒక తోటనూ – మరొక తోటమాలికి వేరొక తోటనూ అప్పగించాడు. మొదటి తోటమాలి తనకిచ్చిన తోటలో రాజుగారి చిత్రపటాన్ని వ్రేలాడదీసి దానికి రోజూ పూలమాలలు వేసి, చందనం అలది, హారతినిచ్చి ఆ పటానికే 108 ప్రదక్షిణలు చేసేవాడు. ఈ కార్యక్రమం చెయ్యటంలో ఎంతో శ్రద్ధను కనబరచేవాడు. కానీ తోటను అస్సలు పట్టించుకునేవాడు కాదు. దానితో తోట ఎండిపోవటం మొదలైంది. రెండవ తోటమాలి తనకు తోట నప్పగించిన రాజుగారి పేరు కూడా మరచిపోయి నిరంతరం తోట పనిలోనే నిమగ్నమైపోయి వుండేవాడు. మొక్కలకు ఎరువు వెయ్యటం, నీరు పెట్టడం, కాలువలు తీయటం, శుభ్రం చెయ్యటం లాంటి పనులన్నీ చెయ్యటం వలన తోట ఆకుపచ్చదనంతో కళకళలాడసాగింది. ఒక సంవత్సరం గడిచిన పిమ్మట రాజు గారు తోటలను చూట్టానికి వచ్చారు. ఎండిపోయిన మొదటి తోటను చూచి కృష్ణుడైపోయి 108 ప్రదక్షిణలు చేసి, హారతుల నిచ్చిన తోటమాలిని పనిలో నుండి తీసివేశాడు. తోటను అందంగా పెంచటానికి కృషి చేసిన రెండవ
తోటమాలిని అభినందించి అతనికి మరిన్ని పనులను అప్పగించాడు. మా భగవంతుడు కూడా ఆ రాజులాంటివాడే! “భగవంతుని కోసం ఏమైనా చెయ్యదలచుకుంటే అది సమాజానికే చెయ్యండి’ అని ఆదేశము నిచ్చాడు. ఆయన ఆదేశాన్ని మేము జీవితకాలమంతా ఆచరించాము. ఎంత చేశామో అంత తిరిగి పొందాము. ఇక ముందు చెయ్యబోయేదానికి కూడా మేము ప్రతిఫలాన్ని పొందుతూనే వుంటాము.
అనువాదం : శ్రీమతి కామరాజు కృష్ణకుమారి
యుగశక్తి గాయత్రి – Jan 2022