అనేకమైన శారీరక బాధలతో సతమతవవుతూ, రోగనివారణకు చాలా ధనాన్ని ఖర్చుచేసి ఫలితం లేక ఒక రోగి రాజవైద్యుడైన సారంగధరుని వద్దకు వస్తాడు. సారంగధరుడు ఆ రోగికి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, నియమపాలన ద్వారా కాలానుగుణంగా జీవించుమని సలహా ఇస్తాడు. రోగి సలహాని ఉపేక్షిస్తూ ఇవన్నీ ఆచరించేవే గానీ బలానికి, రోగ నివారణకు ఏమైనా ఔషధాన్ని ఇవ్వమని అడుగుతాడు. వైద్యుడు చిరునవ్వు నవ్వి, నాయనా నేను చెప్పిన సలహా నీవు పాటించి ఉన్నట్లయితే నీకు నావద్దకు రావలసిన అవసరం ఏర్పడేదికాదు. నీవు జీవిత రసాన్నేకాక జీవిత సామర్థ్యాన్ని, సంపదను కూడా నిగ్రహ నియమాలను ఉల్లంఘించటం వల్లనే నష్టపోయావు. బాహ్యోపచారాలు, బలవర్థక ఔషధాలు మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసే పక్షంలో ఇంతమంది సిరిసంపదలు కల వ్యక్తులు మధుమేహం, అజీర్ణ రోగం మొదలైన అనేక రోగాలతో ఎందుకు బాధపడుతున్నట్లు? రోగానికి మూలకారణం అంతర్గతమైనదేగాని బయట కారణాలు కావు అని వైద్యుడు చెప్పిన మాటలు రోగి జీవితాన్ని మార్చివేశాయి. అంతరంగ, బహిరంగాలలో జరిగే అపవ్యయాన్ని అరికట్టి తద్వారా స్వల్ప వ్యవధిలోనే పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు కాగలిగాడు.
శృంగి మహర్షికి నమస్కరించి, మహాత్మా! నియమోల్లంఘన, నిగ్రహలేమి పేర్లతో ఏర్పడుతున్న గంట్లు ఏ రీతిలో ఉంటాయి? జీవతరసాన్ని వ్యర్థంగా మట్టిలో ఇంకిపోవటానికి తోడ్పడుతున్నవి ఏవి? వీటి దుష్పరిణామాన్ని వ్యక్తులు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఈ రహస్యాన్ని, నివారణోపాయాలను తెలియజేస్తే ఇది భూతల స్వర్గంగా మారిపోతుంది. శాశ్వత దుఃఖ దారిద్ర్య నివారిణి అయిన నివారణోపాయాలను తెలియజేయుమని ప్రార్థిస్తాడు. ఇదే ప్రశ్న అసురుల చేతుల్లో పదేపదే పరాజితులైన దేవతలు ప్రజాపతిని కూడా అడగటం జరిగింది.
ప్రజాపురాణం నుండి
యుగశక్తి గాయత్రి – Jan 2022