Home year2023 గాయత్రీ ఉపాసన ప్రాణచేతనంగా ఉండాలి

గాయత్రీ ఉపాసన ప్రాణచేతనంగా ఉండాలి

by Akhand Jyoti Magazine

Loading

శరీరంలో ప్రవహించే ప్రాణచేతన వల్ల మన
ఈ శరీరానికి ఉన్నత విలువ వస్తుంది. ఏ శరీర
సుఖశాంతుల కోసం, కోరికలు మరియు
వాసనల పూర్తి కోసం నానా తంటాలు పడతామో,
దుర్మార్గాలు చేస్తామో ప్రాణం పోగానే ఆ
శరీరాన్ని కాల్చడానికి, నాశనం చేయడానికి
ఏర్పాట్లు చేయాలి.
గాయత్రీమంత్రానికి అధిష్ఠానదేవత సూర్య
భగవానుడు! సంపూర్ణ సృష్టికి ప్రాణం సూర్య
భగవానుడి నుండి, సవిత్రు దేవత నుండి
లభిస్తుంది అని అందరికీ తెలుసు. ‘సవితా సర్వస్య
‘ప్రసవితా’ ఆధ్యాత్మిక దృష్టిలో సృష్టికి జన్మనిచ్చిన
శక్తి సూర్యుడు.
కాబట్టి శరీరానికన్నా ప్రాణం విలువైనది
అన్నది స్పష్టమవుతోంది. ప్రాణాలు పోగానే శరీరం
శవం అవుతుంది. అంటే శరీరానికి నిజమైన సంపద లోపల
ప్రవహించే ప్రాణచైతన్యం!
ప్రాణాలు లేకపోతే ఈ అందమైన శరీరం, ఆలోచించే
మెదడు, ఇవన్నీ ఎలా ఉంటాయో ఊహించగలం. ప్రాణశక్తే
మూలం. ఎవరిలో ఎంత ప్రాణశక్తి ఉంటే, వారు అంతటి
ప్రాణవంతులు. మనస్వి, తేజస్వి, ప్రతిభాశాలి అయిన వ్యక్తిని
మనం ఎక్కువ ప్రాణవంతుడు అంటాము.
ఉదాహరణకి చిన్నపిల్లల్లో ఉండే ప్రాణ ప్రవాహాన్ని
గమనిస్తే అది వారిని ఒకచోట స్థిరంగా నిలువనీయదు.
కానీ మృత్యువుకి దగ్గరైన ముసలివారు ఒక్కో అడుగు
వేయడానికి ప్రయాసపడుతూంటారు. మానవ జీవనానికి
మూలసంపద ప్రాణశక్తి అన్నది సారాంశం. అదే మన
నిజమైన సంపద. ఈ ప్రాణశక్తి ఆధారంగానే మనకు సమృద్ధి,
విజయం లభిస్తుంది.
మనలోని ప్రాణశక్తిని అభివృద్ధి చేయడమే గాయత్రీ
మహామంత్రానికి మూల ఉద్దేశం. సత్యాన్వేషణ చేస్తే గాయత్రీ
మంత్రం ద్వారా మనం ఎవరిని ఉపాసిస్తామో తెలుస్తుంది.
ఒక్కరోజు సూర్యభగవానుడుఉదయించక
పోతే ఎలా ఉంటుందో ఊహిస్తే వెలుగు ఉండదు,
శక్తి ఉండదు, వేడి ఉండదు, ప్రకాశ సమన్వయము
ఉండదు, ఔషధులు ఉండవు, వనస్పతులు ఉండవు, ధాన్యం
ఉత్పత్తి కాదు, నదులు ప్రవహించవు, వర్షం పడదు – అంతా
అంతమైపోతుంది. మనకు తెలిసిన ఈ జీవితం యొక్క
సంపూర్ణ స్వరూపం పూర్తిగా అంతమైపోతుంది. ఈ దృష్టితో
చూస్తే సమగ్ర అస్తిత్వానికి గాయత్రీమంత్రం సమర్పించబడిన
మంత్రం.
సూర్యభగవానుడికి కూడా రెండు రూపాలున్నాయి. ఒకటి
స్థూలరూపం. ఇది భూమి యొక్క వాయుమండలాన్ని నిర్మిస్తుంది.
ప్రకాశం, శక్తి, వేడి మొదలైనవాటి ఆధారం సూర్యశక్తి. ఆ
శక్తి అన్నింటినీ సంరక్షిస్తుంది, ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది,
ఈ ప్రపంచంలో ప్రాణ ప్రవాహాన్ని ఉత్పన్నం చేస్తుంది.
సూర్యుడి స్థూలశక్తిని మనవరకు తెచ్చే పని కిరణాలు చేస్తాయి.
సూక్ష్మశక్తిని మనవరకు చేర్చే మాధ్యమం గాయత్రీ మంత్రం.
‘గయ’ అనగా ప్రాణం, ‘త్రయ’ అనగా త్రాణం, దాన్ని
రక్షించేది అని శతపథ బ్రాహ్మణం చెపుతుంది. ప్రాణాలను
రక్షించే శక్తిని గాయత్రీమాత అని పిలుస్తారు. ‘గయాన్
ప్రాణాన్ త్రాయతే సా గాయత్రీ’ అని శాస్త్రాలు చెప్తాయి. పురాణాలు మరో విధంగా చెప్తాయి. ‘గాతారం త్రాయతే
యస్మాద్ గాయత్రీ తేన గీయతే’ . అనగా దేన్నైతే గానం
చేయడం ద్వారా రక్షించబడతామో దాన్ని గాయత్రీ అంటారు.

అందుకే ఎన్నో సాధనా గ్రంథాలలో గాయత్రీమంత్రాన్ని
తారకమంత్రంగా చెప్తారు. తారకం అంటే దాటించేది. ఈ
భవసాగరం నుండి, సంసార రూప దుష్కర చక్రాన్ని
దాటడానికి గాయత్రీమంత్ర శక్తి అవసరం. గాయత్రీమంత్రం
మనలో ప్రాణ ప్రవాహాన్ని ఉత్పన్నం చేస్తుంది.
మన శరీరంలో మూడు స్థాయిలున్నాయని అందరికీ
తెలుసు. అవి- స్థూల, సూక్ష్మ, కారణ. గాయత్రీ మంత్రోపాసన
ద్వారా మనలో ఉత్పన్నమయ్యే ప్రాణప్రవాహం మూడు
శరీరాల్లో తేజస్సు, ఓజస్సు, వర్చస్సుగా చెప్పబడుతుంది.
శక్తి ద్వారా ప్రాణం వృద్ధి చెందుతుందో ఆ ప్రాణాన్ని
పొందడం కోసం మన ఉపాసనను కూడా అనుప్రాణితం
చేసుకునే అవసరం ఉంది. బాహ్యంగా కనిపించే కర్మకాండలు,
పూజ-ఉపాసన ఇవన్నీ మన ఉపాసనకు బాహ్య కాయం
వంటివి. ఉపాసన చేసేటప్పటి మన భావన ఏదైతే ఉందో,
శ్రద్ధ ఉంటుందో అదే ఉపాసనకు ప్రాణం. సాధనకు
పరిణామం రావడానికి ఏ వైపు ప్రయాణించాలో చెప్పేది
కర్మకాండ. కానీ సాధన యొక్క సరైన విధానాన్ని దాని
ప్రాణంగా పిలుస్తారు.
సాధనలో, ఉపాసనలో ప్రాణం లేకపోతే దాని అర్థం
ప్రయోజనం ఉండదు అని. రైల్వే గార్డ్ జెండా ఊపితే రైలు
కదులుతుంది. కానీ జెండా అనేది కేవలం సంకేతం మాత్రమే.
కానీ బండి నడిచేది ఇంజన్ ద్వారానే.
అదేవిధంగా గాయత్రీ సాధన యొక్క ప్రాణం బాహ్య
ఆడంబరంలో కాదు-లోపలి ఆధ్యాత్మికతలో ఉంటుంది. మన
ఋషులలో ఏ ఆధ్యాత్మికత ఉన్నదో, ఏ ఆధ్యాత్మికత కారణంగా
భారతదేశం మరియు భారతీయ సంస్కృతి వల్ల మనుషుల
రూపంలో దేవతల గని అయినదో, దేనివల్ల భారతావనికి
విశ్వగురువు స్థానం దక్కిందో, ఏ ఆధ్యాత్మికత వల్ల సప్త
ఋషులు, ఎందరో ప్రముఖ ధర్మ ప్రవర్తకులు, సాధువులు,
యోగులు, తపస్వులు, సాధకులు, అమరులు, గురువులు,
భక్తులు అవతరించడానికి భారతభూమిని ఎన్నుకున్నారో –
ఆ ఆధ్యాత్మికత భారతావని కణకణంలో ఉంది. మనం
చేసే గాయత్రీ ఉపాసన యొక్క ప్రయాణంలో నిగూఢమైన
ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. వాటిని కొత్తగా వెలికి
తీయాల్సిన ప్రయత్నం మనం చేయాలి.

సేకరణ: అఖండజ్యోతి, డిసెంబర్ 2022
అనువాదం: ఎం.వి. ప్రసాద్

Yug Shakti Gayatri Jan 2023

You may also like