Home Gayathri Maha Vignan మనోమయ కోశం- గాయత్రీ మహా విజ్ఞానం (పంచ కోశ సాధన)

మనోమయ కోశం- గాయత్రీ మహా విజ్ఞానం (పంచ కోశ సాధన)

by

Loading

పంచ కోశములలో మూడవది మనోమయ కోశం. దీనినే గాయత్రీ యొక్క తృతీయ ముఖం అని కూడా అంటారు. మనస్సు చాలా చంచలమైనది, వాసనామయమైనది. ఇది సుఖ ప్రాప్తి కొరకు చాలా కల్పనలు చేస్తుంది. ఇది రంగురంగుల చిత్రాలను కల్పన చేస్తుంటే, వీటిని చూసి భ్రమించి అనేక అనవసరమైన హానికరమైన పనులు చేసి తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మంచి పనులు, ప్రశంసలు పొందగలిగే పనులు, కల్పనలు కూడా మనస్సు చేయగలదు. మనిషి ని నరకప్రాయమైన పతనావస్థలో పడేసినా లేక మనిషి ని భూసురినిగా చేసినా, అది మనస్సు యొక్క క్రీడ మాత్రమే.

మనస్సుకు ప్రచండమైన శక్తి ఉన్నది. ఈ ప్రేరక శక్తి తో తన కల్పనా చిత్రాలను ఎంతగా సజీవం చేస్తుదంటే మనిషి దానిని పొందడానికి పరిగెడతాడు. సీతాకోకచిలుకలు ఎగురుతూ పోతుంటే వాటి వెంట చిన్న పిల్లలు పరిగెడుతుంటారు. ఇదే విధంగా సీతాకోకచిలుకల వంటి కల్పనలు, కోరికలు, ఆకాంక్షలు, తృష్ణల వెంట శరీరం పరిగెడుతుంది.

సుఖం మీద ఉన్న కాంక్షయే మనస్సు లో, అంతరాళాలలో ప్రధానంగా పని చేస్తుంది. అది ఏ విషయాన్ని ఏ విధంగా ప్రాప్తించుకోవాలో కల్పన చేస్తుంది. ఒక సుందరమైన, మనోహరమైన రంగు రంగుల ప్రణాళిక తయారు చేస్తుంది. మస్తిష్కం దాని వెంట పడుతుంది. శరీరం ఆ దిశ లోనే పని చేస్తుంది. కానీ మనస్సు చంచలమైనది, అది క్రొత్త కల్పనలు చేస్తూనే ఉంటుంది. నిన్నటి ప్రణాళిక పూర్తి కాకుండానే క్రొత్త ప్రణాళిక ముందుకు వస్తుంది. మనిషి మొదటి దాన్ని వదిలేసి క్రొత్త దానిని పట్టుకుంటాడు. ఇంక ఇదే విధంగా నడుస్తుంటుంది. అనేక అసంపూర్ణ ప్రణాళికలు వదిలేసి క్రొత్త ప్రణాళికలు తయారవుతుంటాయి. నియంత్రణ లేని మనస్సు యొక్క కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. లెక్క లేనన్ని అసఫలతలు, పూర్తికాని కార్యక్రమాల వలన జీవనం అస్తవ్యస్తం అవుతుంది.

ఈనాడు మనిషి భౌతికత వెనుక పిచ్చిగా పరిగెత్తుతున్నాడు. ఆత్మ కళ్యాణం అనే మాటను వదిలేసి, కృత్రిమ సుఖ సౌకర్యాల కొరకు ఉవ్విళ్ళూరుతుంటాడు. ఎవరి దగ్గర ఈ సుఖ సాధనలు ఎంత ఎక్కువగా ఉంటే అంత భాగ్యవంతుడిగా భావిస్తున్నారు. ఎవరి దగ్గర ఈ సుఖ సాధనలు లేవో వారు తమని తాము అభాగ్యులుగా, హీనులుగా, దీనులుగా భావిస్తుంటారు. వారి మనస్సు ఘోరమైన ఉద్విగ్నతకు లోనవుతుంది. తీరని కోరికల వలన శాంతి లభించదు. మనస్సే మనిషికి మిత్రుడు, మనస్సే మనిషికి శత్రువు, మనస్సే బంధనానికి మోక్షానికి కారణమని కూడా గీత లో చెప్పబడింది. వశంలో ఉన్న మనస్సు అమృతంతో సమానం. నియంత్రణ లేని మనస్సు హాలహలం వంటిది. నియంత్రణ లేని మనస్సు ఇంద్రియ భోగాలలో సుఖాన్ని వెతుక్కుంటూ పరిగెడుతుంది.

నాలుక తో రకరకాల రుచులను పొందటానికి దానిని సతాయిస్తుంది. రూప యౌవ్వనాల క్షేత్రంలో కామకలాపాలకు కల్పనా జగత్తులో ఇంద్ర లోకాన్ని తయారు చేస్తుంది. నృత్యం, గీతం, వాయిద్యాలు, మనోరంజనం, షికార్లు, మనోహర దృశ్యాలు దానికి ఆనందదాయకం. వీలయినంత సమయం వీటిలో గడపాలని కోరుకుంటుంది. సర్కస్, సినిమా, క్లబ్, ఆటలు మొదలైన మనోరంజకమైనవి దానికి ఇష్టం. శరీరాన్ని అలంకరించడానికి, విశ్రాంతి ఇవ్వడానికి, బహుమూల్య వస్త్రాభరణములు, కార్లలో, విమానాలలో ప్రయాణం, మెత్తని పరుపు, ఫ్యాన్, ఏసి మొదలైనవి చాలా అవసరమైనవిగా భావిస్తుంది.

సంస్కార విహీనమైన మనస్సు ఇంద్రియ భోగాలు, అహంకార తృప్తి ( satisfaction of ego) ధనం కూడబెట్టడం, అనే మూడు క్షేత్రాలలో సుఖాన్ని వెతుక్కుంటుంది. దానిపై అంకుశం లేకపోవటం వలన ఉచితానుచితాలు పట్టించుకోక జీవిత విధానాన్ని చెడు మార్గం లోకి తీసుకొని వెళ్తుంది. పాశవికమైన కోరికలు తీరటానికి ప్రణాళికలు వెయ్యడం, తర్వాత చిక్కుల్లో పడటం, బాధలు పడటం నియంత్రణ లేని మనస్సు కలవారికి సంభవిస్తాయి. వీరి జీవితం కష్టాలలో మునిగి పాపం దుర్గతి పాలవుతుంది

మనస్సును వశంలో ఉంచుకోవడం అంటే అది బుద్ది యొక్క నియంత్రణ లోకి రావాలి. బుద్ధి ఏది ఔచిత్యమని తలస్తుందో, ఆత్మ హితంగా లాభాలను నష్టాలను బేరీజు వేస్తుందో దానికి తగిన విధంగా మనస్సు కల్పనలు, ప్రణాళికలు వేస్తే, మనస్సు వశంలోకి వచ్చినట్లే. వశంలో ఉన్న మనస్సు ఒక పని మీద నిమగ్నమైతే ఇక అటు ఇటు పోదు.

మనస్సు యొక్క ఏకాగ్రతలో, తన్మయత్వం లో ఎంత ప్రచండ శక్తి ఉందంటే అలాంటి శక్తి ఈ ప్రపంచం లో ఇంకొకటి లేదు. రచయితలు, కవులు, వైజ్ఞానికులు, అన్వేషకులు, నేతలు, మహా పురుషులు అందరూ ఏకాగ్రతతోనే అంతవారయ్యారు.

సూర్య కిరణములు వెదజల్లబడి ఉంటే వాటి ఉపయోగం గొప్పగా ఉండదు. కానీ భూతద్దం ద్వారా ఆ కిరణములను ఏకత్రితం చేసినప్పుడు అక్కడ అగ్ని పుడుతుంది. ఆ జ్వలిస్తున్న అగ్ని తో భయంకరమైన దావానలం సృష్టించవచ్చు. అలాగే మనస్సు యొక్క చిందరవందరగా పడి ఉన్న కల్పనలు, ఆకాంక్షలు, ప్రేరణ శక్తి కూడా ఒక బిందువు మీద ఏకాగ్రం (concentrate) చేయగలిగితే దాని ఫలితాలు ఊహకు కూడా అందవు.

పతంజలి ఋషి యోగ సూత్రములలో యోగమంటే చిత్తవృత్తుల నిరోధమేనని అంటారు. “యోగః చిత్త వృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను నిరోధించాలి. యోగ సాధన యొక్క విశాలమైన కర్మకాండ అంతా చిత్తవృత్తులను ఒక బిందువు పై కేంద్రీకరించుట కొరకే, ఆత్మ యొక్క ఆదేశానుసారం జీవించుట కొరకే. ఈ పనిలో సఫలత లభించగానే ఆత్మ పరమాత్మ తో కూడిన సమస్త రిద్ధి సిద్ధులు లభిస్తాయి. వశంలో ఉన్న శక్తివంతమైన మనస్సు ఎటువైపు ప్రయోగిస్తే అక్కడ ఆశ్చర్యకరమైన చమత్కారాలు జరుగుతాయి. వశంలో ఉన్న మనస్సు ను ప్రయోగించటం వలన ప్రతిభ, యశస్సు, విద్య, ఆరోగ్యం, భోగం, అన్వేషణ మొదలైన వాటిలో ఏది పొందగోరినా నిశ్చయంగా పొందగలరు, దానిని ఏ శక్తి అడ్డుకొనలేదు.

వశంలో ఉన్న మనస్సుతో ప్రాపంచిక కోరికలే కాక పారమార్ధిక ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. సమాధి సుఖం కూడా మనోబలం యొక్క చమత్కారమే. ఏకాగ్రమైన మనస్సుతో చేసిన ఉపాసన తో ఇష్ట దైవం యొక్క సింహాసనం కదులుతుంది. గజేంద్రుని కొరకు గరుత్మంతుడిని వదలి ఒట్టి కాళ్ళతో పరుగెత్తిన భగవంతుని వలె పరుగెత్తవలసి వస్తుంది. అస్పష్టమైన మనస్సుతో చేసిన సాధన అస్పష్టంగానే ఉంటుంది. ఏకాగ్రమైన మనస్సు, వశంలో ఉన్న మనస్సు ఆ లాభాన్ని క్షణంలో సంపాదిస్తుంది. యోగులకు ఇటువంటి మనస్సు జన్మజన్మాంతరముల తపస్సు వలన లభిస్తుంది.

మెస్మరిజం, హిప్నోటిజం, మెంటల్ థెరపి, అకల్ట్ సైన్సు మొదలైన చమత్కారాలు పాశ్చాత్య దేశాలలో ప్రసిద్ధి చెందినవి. తంత్ర క్రియ, శవ సాధన, ఛాయాపురుష్, పిశాచ సిద్ధి, శవ సాధవ మొదలైన చమత్కార శక్తులు భారతీయులకు పరిచయమే. ఇవన్నీ ఏకాగ్రతతో కూడిన మనస్సు యొక్క సంకల్ప శక్తి యొక్క చిన్న చిన్న వినోదములే.

సంకల్పం యొక్క అపూర్వ శక్తి తో మన పూజనీయ పూర్వీకులు తమ ఆధ్యాత్మిక గుణముల వలన సమస్త భూమండలంపై చక్రవర్తి సామ్రాజ్యన్ని స్థాపించారు, జగద్గురువులు గా కీర్తి పొందారు. భూలోకం ను స్వర్గలోకం తోను, పాతాళ లోకంతోను ఇరుగుపొరుగు వారివలె సంబంధం పెట్టుకున్నారు. ఆ శక్తి యొక్క చిన్న చిన్న భౌతిక చమత్కారాలతో రావణుని వంటి వ్యక్తులు గందరగోళం చేసినా అధికాంశ యోగులు ఆ ప్రచండ శక్తి ని లోక కల్యాణం కొరకు వినియోగించారు.

అర్జనుడికి వశంలో ఉన్న మనస్సు వలన ఎటువంటి సిద్ధులు కలుగుతాయో తెలుసు. అందువలన గీతలో భగవంతుడి ని అడుగుతాడు- ” హే అచ్యుత! మనస్సు ను వశంలో ఉంచుకొనే పద్ధతి నాకు తెలపండి ” వాయువు ను వశంలో ఉంచుకొనుట ఎంత కష్టమో, మనస్సును వశంలో ఉంచుకొనుట కూడా అంత కష్టం. వశంలో ఉన్న మనస్సు భూలోకం లో కల్పవృక్షమే. వాయువు ని ఒక యంత్రం ద్వారా ఒక సిలిండర్ లో బంధించవచ్చు కానీ మనస్సు ను వశంలో ఉంచుకొనే యంత్రం ఏదీ లేదు.

మనస్సు ను వశంలో ఉంచుకొనేందుకు భగవంతుడు అర్జనుడికి రెండు ఉపాయాలు చెప్పాడు. 1. అభ్యాసం

2. వైరాగ్యం. అభ్యాసం అంటే మనస్సును నిలవరించగలిగే యోగ సాధనలు. వైరాగ్యం అంటే వ్యావహారిక జీవనంలో సంయమము పాటించడం, జీవితాన్ని సువ్యవస్థితం చేయటం. బద్ధకం, పొరపాట్లు, దుర్వ్యసనములు, దురాచరణ, చంచలత్వం సమయ దురుపయోగం, అస్తవ్యస్తంగా పనులు చేయటం మొదలైన కారణాల వల్ల ప్రాపంచిక జీవితంలో అధోగతి కలుగుతుంది. లోభం, క్రోధం, తృష్ణ మొదలైన వాటితో మానసిక పతనం జరుగుతుంది.

శారీరక, మానసిక, సామాజిక చెడుల నుంచి మనస్సు ను రక్షించుకుని సరళంగా ఆదర్శవాదంతో శాంతిమయ జీవనం సాధించే కళను వైరాగ్యం అంటారు. చాలా మంది ఇంటి బాధ్యతలను వదిలివేసి అడుక్కుతినడం, విచిత్రమైన వేషాలు వెయ్యడం, అవ్యవస్థితంగా తిరగడం వైరాగ్యం అని భావిస్తారు, తర్వాత కష్టాల పాలవుతారు. వైరాగ్యం అంటే రాగముల నివృత్తి.

చెడు భావనల నుండి, చెడు అలవాట్ల నుండి తప్పించుకునే అభ్యాసం కొరకు తగిన వాతావరణం అవసరం. ఈత నేర్చుకోవాలి అంటే తగిన వసతి ఉండాలి, ఈత నేర్చుకుంటే అవసరం అయినప్పుడు పనికి వస్తుంది. నీటికి దూరంగా ఉండి ఈత నేర్చుకుంటానంటే కుదరదు. అలాగే రాగద్వేషములు ఉత్పన్నం అయ్యే పరిస్థితుల్లోనే వాటిపై విజయం ప్రాప్తించుకుంటే వైరాగ్యం లో సఫలీకృతం అయినట్లే.

అడవులలో ఒంటరిగా ఉంటే అది వైరాగ్యం అని అనిపించుకోదు. ఎందుకంటే అడవులలో వైరాగ్యం అవసరమే లేదు. రాగం ఉత్పన్నం అయ్యే పరిస్థితుల్లో ఉంటూనే వాటిపై విజయం ప్రాప్తించుకుంటే, ఆ పరీక్షలలో విజయం సాధిస్తేనే వైరాగ్యం ఉన్నట్లు అవుతుంది. ఒంటరిగా ఉంటే అది వైరాగ్యం అనిపించుకోదు. ప్రభోవాల నుండి నెగ్గటమే వైరాగ్యం. చెడు ఉన్నచోటే చెడు పై నెగ్గటం వైరాగ్యం అనిపించుకుంటుంది. అందువలన గృహస్థుడు గా ఉంటూ, ప్రేరణ, ప్రాపంచిక జీవనంలో సువ్యవస్థంగా ఉంటూ, రాగాల మీద విజయం ప్రాప్తించుకొనడమే వైరాగ్యం అని అనాలి.

అభ్యాసం కొరకు యోగ శాస్త్రములలో ఎన్నో రకాల సాధనల వర్ణన ఉన్నది. వీటి ద్వారా మనో చాంచల్యత, ఉరుకులు పరుగులు, అత్యాశ ఆపివేసి ఋతుంభరా బుద్ధి కి. అంతరాత్మ ఆధీనానికి మనస్సును అందివ్వవచ్చు. ఈ సాధనలను మనోయోగమని అంటారు. వీటిలో

1. ధ్యానం

2.త్రాటకం

3. జనం భ

4. తన్మాత్ర సాధన ప్రధానమైనది. మనోమయ సాధన లో ఈ నాలుగింటికి మహత్వపూర్ణమైన స్థానం ఉన్నది.

ధ్యానం:

ధ్యానం అనేది ఒక మానసిక ప్రక్రియ. దీని ద్వారా మనస్సు లో ఏ వస్తువునయినా స్థాపించుకోవచ్చు. మానసిక క్షేత్రంలో స్థాపించబడిన వస్తువు ఆకర్షణ కేంద్రం అవుతుంది. మస్తిష్కం యొక్క అధికాధిక శక్తులు దాని వైపు లాగబడతాయి. ఫల స్వరూపంగా అవి ఒక స్థానం పై కేంద్రీకరింబడతాయి.

ఏదైనా ఆదర్శాన్ని, లక్ష్యాన్ని, ఇష్టాన్ని నిర్థారించుకుని దానితో తన్మయత్వాన్ని చెందటాన్ని ధ్యానం అంటారు. మనిషి ఎలా ధ్యానం చేస్తే అలా తయారవుతాడు. అచ్చులో తడి మట్టిని వేసి నొక్కితే దాని ఆకృతి మారిపోతుంది. కీటక భృంగముల ఉదాహరణ సుప్రసిద్ధము. భృంగీ (గండు తుమ్మెద) కీటకాన్ని (మిడుత) పట్టుకొచ్చి దాని నలువైపులా ఝుకారం చేస్తూ తిరుగుతుంది. కీటకం ఆ ఝుంకార ధ్వనిని తన్మయత్వంతో వింటుంది. భృంగీ యొక్క రూపంతో, చేష్టలతో శ్రద్ధ తో కలసిపోతుంది. కీటకం యొక్క మనస్సు భృంగమయం అయి భృంగి యొక్క రూపాన్ని పొందడం జరుగుతుంది. దాని మాంసము, నాడులు, చర్మం మొదలైనవి మనస్సు తో పాటు పరివర్తన చెందడం ప్రారంభమవుతుంది. కొద్ది సమయంలోనే దాని మనస్సు, శరీరం భృంగి వలె తయారవుతాయి. ఇదే విధంగా ధ్యానం వలన సాధకుని సర్వాంగముల కాయకల్పం జరుగుతుంది.

సాధారణ ధ్యానం తో మానవుని శరీరం పరివర్తన చెందదు. దీని కొరకు ప్రత్యేకమైన రీతిలో లోతైన సాధనలు చేయవలసి ఉంటుంది. కానీ మానసిక కాయకల్పం చేయటం వలన ప్రతి మనిషి ధ్యాన సాధన తో పరిపూర్ణ మైన లాభం పొందగలడు. ప్రతి సాధకుడు తన ఇష్ట దేవాన్ని ఎంచుకోవాలని ఋషులు నొక్కివక్కాణించారు. ఇష్ట దేవాన్ని ఎంచుకోవటం అంటే జీవన ప్రధాన లక్ష్యాన్ని నిర్థారించుకోవటమే. ఇష్ట దైవ ఉపాసన అంటే ఆ లక్ష్యం లో తన మానసిక చేతన ను తన్మయింపచేయాలి. ఇలా చేయటం వలన మనస్సు యొక్క చిందరవందరగా పడి ఉన్న శక్తులన్నీ ఒక బిందువు పై కేంద్రీకరింపబడతాయి. ఒకే స్థానం పై ఏకాగ్రత సాధించుట వలన ఆ దిశ యందు సర్వ మానసిక శక్తులు లగ్నమవుతాయి. ఫల స్వరూపంగా సాధకుని గుణ స్వభావం, ఆలోచనలు, ఉపాయం అద్భుతమైన రీతిలో పెంపొందుతాయి. అభీష్ట లక్ష్యమును తేలికగా అనతికాలంలో చేరతాడు. దీనినే ఇష్ట సిద్ధి అంటారు.

ఆదర్శముల కొరకు, ఇష్టముల కొరకు ధ్యాన సాధన లో దివ్యరూపధారులై దేవతల రూపంలో భావించుకుని వాటితో తన్మయత స్థాపించుకొనుట యోగుల పద్ధతి. ఒక్కొక్క అభిలాషకు, ఆదర్శానికి ఒక్కొక్క దేవత ఉన్నది. బలమునకు ప్రతిక దుర్గ. ధనమునకు ప్రతీక లక్ష్మి. బుద్ధికి ప్రతీక సరస్వతి, ధార్మిక సంపదకు గాయత్రి, భౌతిక విజ్ఞానమునకు ప్రతీక సావిత్రి గా భావిస్తారు. గౌరి, పద్మ, శచి, మేథా, సావిత్రి, విజయ జయ,దేవసేన స్వధా,స్వాహా, మాతర, లోకమాతర, ధృతి,తుష్టి, పుష్టి, ఆత్మ దేవి అనే షోడశ మాత్రుకలు ప్రసిద్ధి గాంచినవి. శైలపుత్రీ, బ్రహ్మచారి, చంద్ర ఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి,మహా గౌరి, సిద్ధిధాత్రి, — ఈ నవ దుర్గలకు తమ తమ ప్రత్యేకతలు ఉన్నాయి.

అనేక దేవతలకు స్వతంత్ర అధికారం లేదు. ఈశ్వరుడు ఒక్కడే. ఆయన అనేక శక్తులనే అనేక దేవతల పేరుతో పిలుస్తారు. మనుష్యుడు తన ఇచ్ఛ, రుచి, ఆవశ్యకతానుసారం ఈ ఈశ్వరీయ శక్తులను ప్రాప్తించుకునేందుకు, తన వైపు ఆకర్షించుకునేందుకు, తమ లక్ష్యమును ఎంచుకుని, వాటితో తన్మయత్వం పొందటమనే మనో వైజ్ఞానిక ఉపాసన పద్ధతి ద్వారా ఆ శక్తులను తమలో అధిక పరిమాణంలో ధారణ చేస్తారు.

ధ్యాన యోగ సాధనలో, మనస్సు యొక్క ఏకాగ్రతా లక్ష్యాన్ని, ఇష్టాన్ని యోగ స్థితి లో పొందే ప్రయత్నం జరుగుతుంది. దీని కొరకే ధ్యాన విధానం నిర్థారించబడింది.

ధ్యానం లో ఐదు అంగములు ఉన్నాయి.

  1. స్థితి
  2. సంస్థితి
  3. విగతి
  4. ప్రగతి
  5. సంస్మితి.

స్థితి అంటే సాధకుడు ఉపాసన చేసే సమయంలో ఉన్న స్థితి. మందిరంలో, నది ఒడ్డున, ఏకాంతంగా, స్నానం చేసి, స్నానం చెయ్యకుండా, పద్మాసనంలో, సిద్ధాసనంలో, ఎటువైపు తిరిగి కూర్చుని, ఏ ముద్రలో, ఏ సమయంలో, ఎలా ధ్యానం చెయ్యాలి? అనే దానికి సంబంధించిన వ్యవస్థ ను స్థితి అంటారు.

సంస్థితి అంటే ఇష్ట దేవత యొక్క అందమైన రూప నిర్థారణ. ఉపాస్య దేవత యొక్క ముఖాకృతి, ఆకారం, ముద్ర, వస్త్రములు, నగలు, వాహనం, స్థానం, భావములను నిశ్చయించుకోవడాన్ని సంస్థితి అంటారు.

విగతి అంటే ఇష్ట దేవత లో ఏ ప్రత్యేకతలు, శక్తులు, సామర్థ్యములు, పరంపరలు గుణములు ఉన్నాయో తెలుసుకోవడం.

ప్రగతి అంటే ఉపాసనా కాలంలో సాధకుని మనస్సులో ఉన్న భావములు. దాస్య, సఖ, గురు, బంధువు, మిత్రుడు, మాతా, పిత మొదలైన సంబంధాలలో ఏ సంబంధం తో ఉపాస్య దేవతను భావిస్తామో, ఆ స్థితిని ప్రగాఢం చేసేందుకు ఇష్ట దేవతను ధ్యానావస్థలో తమ తమ ఆంతరిక భావాలతో, వివిధ శబ్దాలతో, చేష్టల ద్వారా ఉపస్థితి చేయటాన్ని ప్రగతి అంటారు.

సంస్మితి అంటే సాధకుడు సాధ్యంతో, ఉపాసకుడు ఉపాస్య దేవతతో ఏకం కావటం. భృంగం కీటకం యొక్క తన్మయత ద్వైత స్థానంలో అద్వైతం; ఉపాస్య ఉపాసకుల అబేధంలో స్వయంగా ఇష్ట దైవంతో పరిపూర్ణంగా లీనమైనటువంటి అనుభూతి. అగ్నిలో పడిన కర్ర ముక్క కూడా అగ్ని వలె ఎర్రగామారుతుంది. అలాంటి స్థితి ఏ క్షణంలో అనుభూతిలోకి వస్తుందో దానిని సంస్మితి అంటారు.

Book : గాయత్రీ మహా విజ్ఞాన్ (Hindi Translated)

Author : శ్రీరామ శర్మ ఆచార్య విరచిత

*Note: Please take an expert advise or a Yoga trainer before you are doing for first time Pranayama*

You may also like