పండగల్లో, వేడుకల్లో మంచినీటి దురుపయోగం అనేది నిజం. వేడుకల్లో అన్ని ఏర్పాట్లు వైభవంగా చేసినప్పటికీ భోజనాల తరువాత చేతులో కడుక్కునే వ్యవస్థ మాత్రం చాలా సార్లు సరిగ్గా ఉండదు. ప్లాస్టిక్ బాటిళ్లు మాత్రం విరివిగా అందుబాటులో ఉంటాయి. 200 మీ.లి మొదలుకుని రెండు లీటర్ల వరకు రకరకాల బాటిళ్లు కౌంటర్ లో ఉంచబడతాయి. చేయి కడుక్కోడానికి, తాగడానికి కూడా వాటినే విడి విడిగా వాడతారు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూంటారు. నీటిని ఇంత విరివిగా వాడడం, పారేయడం అనేది మన కళ్ళ ముందే జరుగుతుంది. తాగడానికి విడిగా, కడుక్కోడానికి విడిగా నీళ్ల ఏర్పాటు చేయడం అంత కష్టమా అనిపిస్తూంటుంది. ఈ మూర్ఖ వైఖరిని అరికట్టలేమా, ఇంత వ్యర్ధాన్ని ఆపలేమా అని మదనపడాల్సి వస్తుంది.
కానీ ఇది అసాధ్యమైన పని కాదు. కుదరదు అని సాకులు చెప్పడానికి కొన్ని భయంకర కారణాలు కూడా ఉండకపోలేదు. భేషజాలకు పోయి చేతులు కడుక్కోడానికి ఒకటి, తాగడానికి ఒకటి, పుక్కలించటానికి ఒకటి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ చేతికొచ్చినన్ని బాటిళ్లు తీసుకోవడం, పారేయడం అనేది సామాన్యమైన విషయం అయిపోయింది. ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాటిని వాడే వారికి కూడా అది ప్రమాదకరమే. ఈ మధ్య కాలంలో వాడి పారేయడానికి వీలుగా ఉన్న ప్లాస్టిక్, థెర్మోకోల్, అల్యూమినియం ఫాయిల్ వాడకం చాలా ఎక్కువైపోయింది. వేడుకల్లో ట్రక్కుల కొద్దీ ఇలాంటి వస్తువులు వాడుతూంటారు. చాల తేలికగా ఉంటాయి కాబట్టి ఎక్కడపడితే అక్కడ పడిపోయి కనిపిస్తూంటాయి. నగరాలు, పట్టణాలు సరే సరి, ఈ మధ్య గ్రామాల అందాన్ని కూడా ఇవి చెడకొడుతున్నాయి. వాటిని పారేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. పారిశ్రామిక, ఆర్ధిక ఉన్నతి పేరిట, వీటి ఉత్పత్తి, వినియోగం ఇంకా పెరిగిపోయింది. ‘యూస్ అండ్ త్రో’, ‘వాడి పారేసేయి’ అనే సంస్కృతి పెరిగిపోయి సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తున్నది.
మట్టి, స్టీల్, గాజు వంటి వాటితో తయారయిన ఇతర సామాగ్రిని వాడడం అంత కష్టమా? పర్యావరణానికి హాని కలిగించని ప్లేట్లు, కప్పులు కూడా ఈ మధ్య తయారవుతున్నాయి. ఆకులు, చెట్ల బెరడులు, ధాన్యపు వడ్లు వగైరా ప్రాకృతిక వస్తువులతో కూడా తయారు చేస్తున్నారు. ఇటువంటి చిన్న పరిశ్రమలకు చేయూతనిస్తే ఎందరికో వృత్తిపరంగా సహాయపడగలం కూడా. నీళ్ళకి బాటిళ్ల బదులు జగ్గులు, ట్యాన్కులు ఉపగించడం సబబు. నీటి వంటి అమూల్యమైన వస్తువుని ఆర్ధిక లాభాల కోసం, భేషజాలు కోసం మినరల్ వాటర్ పేరిట అమ్మడం, కొనడం చేయడం ఇకనైనా ఆపాలి. వాటివల్ల పృథ్వీ మీద కొండల కొండలాగా చెత్త పేరుకుపోతోంది తప్ప ఇతర ప్రయోజనాలేమి లేవు. అలా చాలా కాలం బాటిళ్లలో నిల్వ ఉంచిన నీరు వాసన కూడా వస్తుంది. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. మినరల్ వాటర్ అని చెప్పబడేవి కూడా నాణ్యతలను పాటించారు. పైగా శుభ్రంగా కనిపించే సాధారణమైన నీటిని వాటిలో నింపి మోసం చేసి అమ్మేవారి సంఖ్యా కూడా పెరిగిపోతోంది. తాగడానికి పనికి రాని ఈ నీటి వ్యాపారం సమాజంలో మోసగాళ్లను, అనైతికతకు పెంచుతోంది. ప్రజలకి, ప్రకృతికి కూడా ఇది చాల హానికరం. దేశానికే కాదు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకి కూడా హానికరం.
వినియోగాన్ని అరికట్టడంతో పాటు వినియోగ విధానాలను, నాణ్యతను కూడా మెరుగుపరుచుకోవాలి. మన ప్రాధాన్యతలను మార్చుకోవాలి. పునర్వినియోగానికి ప్రాముఖ్యతనివ్వాలి. నీటిని, ఇతర వనరులను విజ్ఞతతో ఉపయోగించుకోవాలి. అప్పుడే కాలుష్యాన్ని అరికట్టి ప్రకృతిని కాపాడుకోగలం. మన అలవాట్లు, వైఖరిని మార్చుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. సాకారాత్మకమైన, సంతులిత దృక్పథాన్ని అలవర్చుకునే దారిలో ప్రయాణిద్దాం. ప్రాణప్రదాత అయిన నీటిని గౌరవిద్దాము, పరిరక్షించుకుందాము.
Source: Akhand Jyoti Magazine 2020 Sept-Oct
Akhand Jyoti is not merely a magazine Its an embodiment of my soul
— Pandit Sriram Sharma Acharya
Translated