మావద్ద నుండి ఎవ్వరూ ఆకలితో వెనుదిరిగి వెళ్ళలేదు. గాయత్రీ తపోభూమి నిర్మాణానికి ముందు ఎవరెవరు వచ్చే వారో వారందరూ తపోభూమి నిర్మించిన తదుపరి కూడా వచ్చేవారు. ఎప్పుడు వచ్చినా వారికి వసతి ఏర్పాటు చేసే వారము. ప్రారంభములో మా ఇంటిలోనే వసతి ఏర్పాటు చేయ బడింది. ఏ సమయములో వచ్చినా, ఎంత రాత్రివేళ వచ్చినా సరే వీలైనంతవరకూ అతిథిసత్కారములు చేసేవారము. ఇంట్లో పాలు, పెరుగు, కూరగాయలు వంటి పదార్థములు లేకపోయినా ‘కిచిడీ’ మటుకు తప్పకుండా చేసి అందించేవారము. ఆ ‘కిచిడీ’ తినటంలోని ఆనందానుభూతిని పరిజనులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. పదార్థములు ఎక్కడైనా లభిస్తాయి. కానీ ఆ సంస్కారములు, భావనలు ఎక్కడా లభించవు. వాటిని మేము వారి వ్యక్తిగత జీవితము నుండీ నేర్చుకొని సాధనారంగములో ముందుకు సాగాము. ‘తమరు ఏవిధముగా జీవిస్తున్నారో యథాతథముగా మేము అలాగే జీవించటానికి ప్రయత్నిస్తాము’ అని మేము వారికి మాట ఇచ్చాము. మేము ఇందులో సమర్థులము కాగలము. ప్రజాహితం కోసం మేము కూడా పనిచేయవలెననే కోరికా, పనిచేయగలమనే నమ్మకమూ మాకు వున్నవి.’ సుదీర్ఘమైన జీవన పయనాన్ని సాగించి గమ్యమును చేరుకొనటానికి మాకు స్నేహితుడు, మార్గదర్శకుడు దొరికినట్లు అర్థమైనది. పరిస్థితులు ఎలా వున్నా 200 రూపాయల లోపే ఇంటి ఖర్చును ముగించవలెనని నిర్ణయించుకున్నాము. అంటే మావద్ద డబ్బు లేదని కాదు; ఉన్నది. కానీ మేము దానిని అత్యవసరములకే వాడుకొని మిగిలినది ఇతరుల కోసం వెచ్చించవలెనని నిర్ణయించుకున్నాము.
ఇది మా కుటుంబము. కుటుంబము అంటే వ్యక్తిగతమైన కుటుంబము కాదు. మేము ‘వ్యక్తిగతంగా’ ఎప్పుడూ వుండ లేదు. మేము సమాజానికీ, దేశానికీ, యావత్ ప్రపంచానికీ చెందినవారము. గాయత్రీపరివార్, అఖండజ్యోతిపరివార్, యుగనిర్మాణపరివార్, తపోభూమి, శాంతికుంజ్, బ్రహ్మ వర్చస్… ఈ సంస్థలన్నింటికీ చెందిన వ్యక్తులందరూ మా కుటుంబమే. లక్షల, కోట్ల సంఖ్యలో వున్న పరిజను లందరూ మా కుటుంబమే! ఆ కుటుంబాలలోని వ్యక్తులందరకూ మంచి ఆహారవ్యవస్థ లభించనప్పుడు మేము మాత్రము ఒంటరిగా తినటము ఎలా సాధ్యమౌతుంది? కనుక మేము 200 రూపాయలలోపే మా నెలవారీ ఖర్చును గడుపుకొని మిగిలినది సమాజము కోసం ఉపయోగించాము. వాళ్ళు బంధువులు కానీ, బైటి వ్యక్తులు కానీ ఏ వర్గమైనా, ఏ జాతి ఐనా సరే ఆపదలో వున్నవారికీ, అవసరము వున్నవారికీ వాళ్ళు ఎవరైనాసరే ‘మా పిల్లలే’ అన్న భావనతో వారికోసం ఖర్చుచేశాము. సాధుసంతులకు, ఋషులకు జాతితో పనిలేదు. గుణ-కర్మ-స్వభావముల సమరూపతయే వారిని ఒక కుటుంబముగా తయారుచేస్తుంది. పిల్లవాడిలో తండ్రి తన ‘బిడ్డను’ మాత్రమే చూస్తాడు. సంస్కారవంతుడైనా లేక కుసంస్కారియైనా సరే వాడు తన ‘బిడ్డ’ అని అనుకుంటాడు. కుసంస్కారిని సంస్కారవంతుడిగా మార్చే ప్రయత్నము చేస్తాడు. శ్రేష్ఠమైన వ్యక్తిత్వము కలవానిగా తీర్చిదిద్దాలనుకుంటాడు. మా యొక్క లక్ష్యము కూడా అదే! మా పిల్లలతో మొదలుకొని మా పరిజనుల వరకూ మేము దానినే నేర్పించాము, అమలుపరిచాము. శాంతికుంజ్లో మా బిడ్డలు ఎంతోమంది వున్నారు. వారిపైన దృష్టిసారించినప్పుడు ‘వీరిలో కొందరు లేమిలో వున్నారు. ఐతేనేమి వారు మంచి శిక్షణలో వున్నారు. శిక్షణ వున్నప్పుడు లేమి మనిషిని బాధించదు’ అని అనుకుంటాము. లేనివారికి మనము మరింత ధనం ఇవ్వవచ్చు. కానీ అది వారికి అధికమైనప్పుడు వారి సంస్కారము చెడిపోతుంది. ఫలితముగా మారు పతనమైపోతారు. వీరిలో మనము త్యాగము, తపస్సు వంటి భావనలను నింపాలి. సేవా భావమును ప్రోదిచెయ్యాలి. వీళ్ళు మనవాళ్ళు, మన దగ్గర వున్నారు. వీలైనంతవరకు ప్రయత్నము చెయ్యాలి. ఈవిధము గానే వీరిని తీర్చిదిద్దాలి’ అని కూడా ఆలోచిస్తాము. ఇక్కడ సర్దార్ వల్లభాయ్పిటేల్ని ఉదాహరణగా చెప్పు కుందాము. పటేల్గారి తండ్రి ఝబేర్భాయి ఆ రోజులలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఎవరో ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. వీరి ఇంట భోజనవసతి ఏర్పాటు చేయబడినది. ఆనాడు భోజనములో రకరకాల పిండివంటలతో పాటు ‘పాయసం’ కూడా తయారు చెయ్యబడినది. అప్పుడు ఝబేర్ చిన్నవాడు. అతను వీధిలో వెడుతూ వున్నప్పుడు ఒక పిల్లవాడు ఏడుస్తువుంటే తల్లి బుజ్జగించి ఓదార్చటం చూచాడు. ఎందుకు పిల్లవాడు ఏడుస్తున్నాడు అని ఝబేర్ అడుగగా ఆమె ‘ఈరోజు ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో విందుభోజనానికి మా అందరి ఇళ్ళ నుండి పాలు తీసుకు వెళ్ళారు. పాలు కావాలని మా అబ్బాయి ఏడుస్తున్నాడు. ఎంత చెప్పినా వినటంలేదు’ అని ఆమె తన నిస్సహాయతతో కూడిన వేదనను వెల్లడించింది. ఆమె బాధను చూసి చలించి పోయాడు ఝబేర్.
ఇంటికి తిరిగివచ్చిన పిదప తండ్రి భోజనం చెయ్యమనగా తనకు కలిగిన బాధను గురించి చెప్పి ‘చిన్నపిల్లలకు అవసరమయ్యే పాలను వారికి వుంచకుండా తీసుకొచ్చి ఇక్కడ విందుకోసం పాయసం చేయించారు. అది నాకు ఇష్టం లేదు’ అని చెప్తూ భోజనం చెయ్యటానికి నిరాకరించాడు. మేము కూడా మా జీవితమును మితవ్యయముతో సాగించాలని నిర్ణయించుకున్నాము. అదేవిధముగా జీవించాము. ఎప్పుడైనా అనారోగ్యం కలిగినా చలించలేదు. మనది శరీరం కదా! ప్రకృతిననుసరించి అది ఎప్పుడైనా అస్వస్థతకు లోనవుతుంది కదా! దానిని పూర్వస్థితికి తేవటానికి మనము ఏదైనా చెయ్యవల్సివుంటుంది. అలాగే ఒకసారి ఆచార్యులవారు అనారోగ్యమునకు గురయ్యారు. శరీరము దుర్బలమైనది. కొంచెం బత్తాయిపండ్ల రసం ఇవ్వవలెనని ఆలోచించి బత్తాయిరసం తెప్పించి ఇచ్చాము. ఆచార్యులవారు పరాకుగా వుండి త్రాగేశారు కానీ తరువాత ‘బత్తాయిపండ్లు చాలా ఖరీదుగా వున్నాయి. నాకు ఇంకమీదట రసం ఇవ్వవద్దు’ అని ఆదేశించారు. ‘మన పిల్లలకు, పరిజనులకు మనము పండ్లరసం ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి మాత్రం పండ్లరసం త్రాగే హక్కు ఎలా వుంటుంది?’ అని అన్నారు వారు. ఆహారం తినడం ద్వారా వచ్చే బలంతో కాదు; మనము ఆత్మశక్తితో, ఆత్మబలంతో జీవించగలగాలి’ అని కూడా వారు ప్రబోధించారు.
Yug Shakti Gayatri Jan 2023