ఒకరిపట్ల ఒకరికున్న దుర్భావన వల్లనే పరస్పర ద్వేషం పుట్టి గొడవలొచ్చే పరిస్థితులు వస్తాయి. వాటి వల్ల అనైతిక, అవాంఛనీయ సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ చోట ఎక్కువ అధికారాలు దక్కాలని, ఇతరుల కన్నా ఎక్కువ సౌకర్యాలు పొందాలని కోరుకుంటున్నారే తప్ప కర్తవ్యాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కర్తవ్యాలను నెరవేర్చ కుండా అధికారాలు కోరుకోవడం వల్లనే గొడవలన్నీ పుట్టు కొస్తున్నాయి. అధికారాల గురించి అడగకుండా, కర్తవ్యాలను పూర్తిగా పాటించినప్పుడే శాంతి నెలకొంటుంది.
మనుషులు ఇతరుల పట్ల తమ నైతిక బాధ్యతలను పాటించడానికి తత్పరతతో ఉన్నప్పుడే సువ్యవస్థిత పౌర జీవనం కొనసాగుతుంది. సామాజిక సుఖశాంతులకు, ప్రగతికి ఇదే ఆధారం. తమ కర్తవ్యాలను సరిగ్గా పాటించే పౌరులున్న దేశమే సబల దేశంగా పరిగణించబడుతుంది. మంచి వ్యక్తిత్వం గల పౌరులు ఎక్కువగా ఉన్న సమాజాన్నే సభ్య సమాజం అంటారు. కర్తవ్యాలు, బాధ్యతల పట్ల వ్యక్తికున్న గౌరవాన్ని బట్టి అతని ఔన్నత్యాన్ని కొలవగలం. అబద్ధాలకోరులు, అవినీతి పరులు, ధూర్తులు, మోసగాళ్ళు, బద్దకస్తులు, పిరికి వారు ఎంత సంపన్నులైనా గాని, వారు, వారి తోటివారి స్థాయి ఎప్పుడూ నీచంగానే పరిగణించబడుతుంది. చిరస్థాయి గొప్ప తనం, సంతృప్తి, ప్రతిష్ఠ సాధించడం వారి వల్ల ఎప్పటికీ కాదు.
ఒకరి పట్ల ఒకరు సద్వ్యవహారాన్ని పాటిస్తే, పరస్పర స్నేహం, సంతోషం, సద్భావాలు ఉత్పన్నమవుతాయి. సద్వ్యవహారం సౌశీల్యంతోనే ప్రేమ పుడుతుంది. దుష్టత్వం మరియు దుర్బుద్ధి అనేవి మనసులో ఉన్నంత సేపు ఎవరి పట్టా నిజమైన సద్వ్యవహారాన్ని చూపలేము. చాతుర్యంతో నకిలీ, అబద్దపు మర్యాదలు చూపించినా, అవి ఎక్కువ కాలం
ఎవరినీ భ్రమలో ఉంచలేవు. ఎప్పుడో అప్పుడు బయటపడు తుంది.
కాని ఎక్కడైతే సద్భావనలు నిజంగా, స్వాభావికంగా ఉంటాయో, అక్కడ ప్రేమ, నమ్మకం దానంతటదే ఉత్పన్న మవుతుంది. మనషుల మధ్య ప్రేమ, విశ్వాసాల బంధం ఏర్పడితే వారు స్నేహితు లవుతారు. నిజమైన స్నేహితుల పరస్పర వ్యవహారం వల్ల కలిగే ఆనందానికి సాటి మరేదీ ప్రపంచంలో లేదు. కుటుంబం, బాంధవ్యం, మైత్రి లేదా వివాహం, వీటికి స్వతహాగా గుణదోషాలు ఉండవు. ఆప్యాయత, సద్భావనల వల్ల పుట్టే ప్రేమనే ఆత్మీయతకు కారణం అవుతుంది. తండ్రి కొడుకులు, అన్నదమ్ముల మధ్య వైరం ఉన్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. భార్యభర్తల మధ్య ఉండే మనో మాలిన్యం వల్ల కలిసుండడం బాధగా అనిపించడమే కాక, ప్రాణాలు తీసేంత ఉద్వేగం కూడా కలుగుతుంది. ఎంతో మంది చుట్టాలు, లోకోపచారం కోసం మంచి వ్యవహారాన్ని చూపిస్తారు. చాలా మంది మిత్రులు అవసరానికి దగ్గరవుతారు. పనైపోయాక చూడనైనా చూడరు.
ఆంతరిక సద్భావన లేకుండా ఏర్పడ్డ పరస్పర మైత్రి, కుటుంబాలు, వివాహాలు, బాంధవ్యాలు అన్నీ అబద్దమనే ఋజువవుతాయి. అలా కాకుండా, ఎలాంటి బంధాలు లేని వారు కూడా మానవత్వం, సజ్జనత్వం పేరు మీద ఒకరికొకరు సహకరించుకునేది నిజమైన బంధువులు, స్నేహితులు కన్నా ఎక్కువ ఉంటుంది. నిజమైన పరస్పర ప్రేమ వల్ల కలిగే ఆనందం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద వరం. అది లభించినవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని దక్కించుకోవడం లేదా వదులుకోవడం అనేది మనిషి చేతిలో ఉంది. తనలోపల ఇతరుల పట్ల ఆత్మీయత, మమతలతో కూడిన వ్యవహార ప్రవృత్తి మేల్కుంటే, దాని వల్ల పరిచయ మయిన ప్రతి వ్యక్తితో మధురమైన, ఆనందకరమైన అనుభవం
దక్కుతుంది. అది లేకపోతే, పూతపూసిన శిష్టాచారాన్ని సునాయాసంగా పసిగట్టవచ్చు. నిస్సారమైన మనసుతో చేసే వ్యవహారం లాగానే దాని ప్రభావం కూడా పరిమితంగానే ఉంటుంది.
దాంపత్య జీవితంలో, పిల్లలు, కుటుంబం, స్నేహితులతో ప్రవర్తించే రీతి, చూపించే ప్రేమ, సద్భావాలను కొంచం వికసింపచేసుకుని, పరిచయం అయిన వారందరితో అలాగే వ్యవహరిస్తే, ‘వసుధైవ కుటుంబకం’ అన్న ఆదర్శం పూర్తవు తుంది. ‘ఉదార వ్యక్తిత్వం కలవారు అనిపించుకునే అధికారం దక్కుతుంది. ఈ బాంధవ్యం వికసించి సమాజంలో వ్యాపిస్తే, ఒక మనిషి ద్వారా మరొకరు అసాధారణ ప్రసన్నత, ఆనందాలను అనుభవిస్తారు. ఐక్యత, ఆత్మీయతల బంధం మనుషుల మనోభూమిలో వ్యాపించినప్పుడు, భూమి మీద స్వర్గం సాకారమై దర్శనమిస్తుంది. దీనితో ప్రపంచమంతా సుఖశాంతులతో నిండుతుంది.
మనుషులు పరస్పరం గొడవపడకుండా ఉండూ, సద్భావాలను పెంచుకుంటూ, సంస్థలు, సంగరనలు ఏర్పర్చు కోవాలనే ఉద్దేశంతో చట్టాలు, శాసనాలు, సమాజ వ్యవస్థ ఏర్పర్చబడ్డాయి. సభలు, సమ్మేళనాలు, విందులు, గోష్ఠి
మొదలైనవి ఏర్పాటు చేయడంలో ఉద్దేశం, అక్కడ కలిసిన వారందరిలో సహకారం, సామీప్యం అనే బీజాలు నాటడం. నాగరికత, శిష్టాచారాల శాస్త్రం రచించబడింది కూడా మనుషులు పరస్పరం హాని కలిగించుకోకుండా, స్నేహం, సహకారం, ఔదార్యం మరియు సౌశీల్యంతో వ్యవహరిస్తూ ఉపయోగపడాలి.
పౌర బాధ్యతలను పట్టించుకోరు అనేది చాలా విరివిగా వినవచ్చే ఫిర్యాదు. సమాజం పట్ల బనకున్న బాధ్యతేంటి, దాన్ని ఎలా నిర్వర్తించాలి అనేది ఆలోచించరు. రోడ్డు మీద కుడివైపు నడవకూడదు. సందుల్లో ఇంటి చెత్త వేయకూడదు. రైళ్ళల్లో, బస్సుల్లో, కేటాయించినదానికన్నా ఎక్కువ చోటు వాడకూడదు. ఒప్పుకున్న సమయానికి కట్టుబడి హాజరు
కావాలి. పుచ్చుకున్న వస్తువులు తిరిగి ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి. మర్యాదలు పాటించాలి. వీటిలో ఏవైనా చేయకపోతే అది నాగరికత, సభ్యతలను ముక్కలు చేస్తున్నట్టు. మాట్లాడడం, కూర్చోవడం, తినడం, స్నానం చేయడం, దుస్తులు తొడుక్కోవడం, పుక్కిలించడం మొదలైన వాటిలో మనుషులు చాలా అసభ్యత కనబరుస్తారు. అలా చేయడం గొప్పగా భావిస్తారు. ఈ తప్పులను సరిదిద్దడానికి పౌర శిక్షణ, శిష్టాచార ప్రచలన చేయడం అవసరం అని అర్థం చేసుకున్నారు.
ప్రపంచంలో సద్భావం, సౌశీల్యం పెరిగి, అపరాధాలు మరియు పాపాల సత్తా తగ్గాలంటే దానికి ఒకటే ఆధారం – సజ్జనత్వాన్ని వ్యక్తపరచడం. దీన్నే నిజమైన పౌరత్వం మరియు నైతికత్వం అంటారు. విశ్వశాంతికి అదొచ్చే సమస్యలకు సమాధానం ఇదే. పరస్పర సద్భావాలను అభివృద్ధిపరుచు కోవడానికి, దానితో కలిగే ఆనందాన్ని పెంచుకోవడానికి,
ఆత్మీయతను వ్యాపింపచేసుకోవాలి. మానవీయ సద్గుణాలే బాహ్య జీవితంలో సుఖశాంతుల పరిస్థితులను ఉత్పన్నం చేయగలవు.
సేకరణ: యుగ నిర్మాణ యోజన, మే 2020
అనువాదం : ఎం.వి.ప్రసాద్, అడ్వకేట్
యుగశక్తి గాయత్రి – Dec 2021