భారతదేశం యొక్క తత్వజ్ఞానం విశ్వంలోని మూలమూలలకు వ్యాపించి దూరదేశాల నుండి యాత్రికులు వచ్చి, భారతదేశం నుండి జ్ఞాన సంపదను ఆర్జించి తమ దేశాలకు తిరిగి వెళ్ళి, తమ దేశవాసులకు ఆ భారతీయ తత్వజ్ఞానం యొక్క మర్మాన్ని అవగతం చేస్తున్న రోజులు అవి. ఈ పరంపరలోని ఒక బౌద్ధసాధువు రెండువేల సంవత్సరాల పూర్వం జ్ఞానార్జనకై ఒకసారి భారతదేశానికి రావటం జరిగింది. ‘ఏరో’ స్వల్పకాలం భారతభూమిపై గడిపి వెళ్ళాలని వచ్చిన ఈ సన్యాసి భారతీయ జ్ఞానసంపద వెదజల్లే వెలుగులో తన్మయుడై 12 సం||లు అనేక విద్యాపీఠాలలోను, విశ్వవిద్యాలయాలలోను భారతీయ వేదాంతాన్ని అధ్యయనం చేసి, “పాండు” లిపిలోనున్న అనేక దుర్లభ గ్రంథాలను వెంట తీసుకొని చైనాకు తిరిగి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో తుఫాను ప్రారంభమై ఓడలో నీరు నిండి బరువుతో మునిగిపోసాగింది.
అంతిమ క్షణాలలో కూడా ధైర్యాన్ని కోల్పోక జ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేస్తూనే, “సాధువును తమ అతిథిగా భావించి ఆయనను ఈ ఆపద నుండి ఎలా రక్షించాలా?” అని ఆలోచించే ఆ నావలో ప్రయాణించే భారతీయ విద్యార్థులను చూచి సాధువు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరకు విద్యార్థులు ఈతగాళ్ళను సలహా అడిగారు. వారి సలహా మేరకు ఓడలో సగం మంది ఉండి మిగతా సగం మంది ఖాళీ చేస్తే ఓడను, ఓడలో ఉన్నవారిని రక్షించటం వీలవుతుందని గ్రహించారు. వెంటనే భారతీయ విద్యార్థులు అఘాతం లాంటి సింధు మహాసముద్రంలో దూకి ప్రాణత్యాగం చేస్తారు. సన్యాసి, త్యాగభూమీ! ఓ భారతభూమీ! అంటూ ఎలుగెత్తి భారతభూమికి జేజేలు పల్కుతాడు కన్నీళ్ళతో.
ప్రజ్ఞాపురాణం నుండి