Home Life Managment కనువిప్పు

కనువిప్పు

by

Loading

సర్వమిత్ర మహారాజుకు మద్యం లేకుండా శాంతి లభించేది కాదు. రాజమహలైనా, రాజదర్బారైనా నిస్సంకోచంగా మద్యాన్ని సేవించేవాడు. తనతోపాటు ఇతరులను కూడా త్రాగించేవాడు. అనతి కాలంలోనే రాచకార్యాలు అస్తవ్యస్తంగా తయారైనాయి. అధికారులు ప్రజలను హింసించసాగారు. ప్రజలు కన్నీళ్ళతో విలపించారు. రాజే ఆచరణహీనుడైతే ప్రజల గోడు వినేదెవ్వరు? ప్రజల దుస్థితిని చూసి ఒక బ్రాహ్మణుడు రాజుగారి వ్యసనాన్ని దూరం చేయాలని సంకల్పించుకొన్నాడు.

ఒకరోజు రాజుగారి సవారి వెళుతూ మార్గ మధ్యంలో గుంపులు, గుంపులుగా మూగి ఉన్న జనాన్ని చూసి కారణమేమిటని ప్రశ్నించాడు. ఎవరో మద్యాన్ని అమ్ముతున్నాడని, దానిలో ఏదో విశేషం ఉండి ఉంటుందని, లేకపోతే ఇంతమంది జనం చుట్టూ చేరరనే విషయాన్ని విన్నవించారు. రాజు సవారీ ఆపి, అక్కడకు సమీపంచేసరికి బ్రాహ్మణుని గొంతు వినపడింది. “ఎవరైతే పతనం పరాకాష్టకు చేరుకోవాలని ఆశిస్తున్నారో వారు తక్షణం ఈ మద్యాన్ని సేవించండి. ఇది త్రాగగానే ఒళ్ళు మరిచిపోతారు. మురికి కాలవలో ముఖం కడుగుకొంటారు. పురుగులు ముఖం మీద స్వైర విహారం చేస్తాయి. కుక్కలు మీ ముఖాన్ని భయంలేకుండా నాకుతాయి. దీన్ని తాగిన భర్తలను భార్యలు చితకబాదుతారు. ఐశ్వర్యవంతుడు దరిద్రుడై చిప్ప పట్టుకుని అడుక్కొంటాడు. ఇది త్రాగిన తక్షణం లక్ష్యాలను, కర్తవ్యాలను మరచి యథేచ్చగా రోడ్లవెంట తిరుగుతారు. వ్యక్తిలో ఇంతటి పరివర్తనను తీసుకుని రాగల మద్యం కొరకు రండి, త్వరపడండి, ఆలస్యమైతే ఆశాభంగం” అంటూ బిగ్గరగా బ్రాహ్మణుడు అరుస్తున్నాడు. రాజు నిశ్చేష్టుడై “ఇన్ని అవగుణాలను ఇంత స్పష్టంగా చెపితే ఎవరు కొంటారయ్యా? నీ దగ్గర వ్యాపారం చేసుకొనే లక్షణాలున్నాయా?” అని రాజు ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు, “రాజా! నేను సత్యవాది అయిన బ్రాహ్మణుణ్ణి. దీనిలో ఉన్న గుణాలే తప్ప లేని గుణాలని ఎక్కడ చెప్పగలను? ఏది సత్యమో అదే చెపుతున్నా” అన్నాడు. “ఇలాగైతే నీకు అమ్మడం రాదు.” అని హెచ్చరించాడు రాజు. దానికి బ్రాహ్మణుడు నిశ్చింతగా “పతనానికి భయపడే సాధారణ ప్రజలు “నకపోవచ్చు. కానీ శాసకులు, అధికారులు కొంటారు. ఇది త్రాగటం వలన వారు ప్రజలపై మరిన్ని అత్యాచారాలు చేసి సంపదను గడించుకోవచ్చు” అన్నాడు.

ఆ మాటలు రాజును ఆలోచింపచేశాయి. తన రాజ్యపు పూర్తి స్వరూపం అతనికి కళ్ళకు కట్టినట్లు కన్పించింది. బ్రాహ్మణునిలోని దివ్య తేజస్సు అతనిలో పరివర్తనను తీసికొని వచ్చింది. సవారీ దిగి ఆయన పాదాలమీద వ్రాలి, “ఓ మహానుభావా! నీవు నన్ను పతనం నుండి ఉద్దరించటానికి వచ్చిన దైవానివిగానీ మద్యం అమ్ముకొనే బ్రాహ్మణుడవు కావు. నా కళ్ళు తెరచుకున్నాయి. నేను ఈ రోజు నుండి ఈ పాపాన్ని తాకను” అని ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణుడు ఆనందించి “నీకు శుభం కల్గుగాక”యని రాజుని ఆశీర్వదించి, ఆనందంతో రాజ్యం నుండి నిష్క్రమించాడు.

– ప్రజ్ఞాపురాణం నుండి

You may also like