170
ఒక ఉడుత సెనగచేలోనికి వెళ్ళి కడుపునిండా తింటూ సుఖంగా జీవించేది. కాని ఒకనాడు దానికి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ దగ్గర కాక, పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆహారాన్ని ఎందుకు స్వీకరించకూడదు అనే ఆలోచన వచ్చింది. ఎదురుగా ఒక పెద్ద బూరుగు దూది చెట్టు, చెట్టునిండా వందలాది కాయలు వేలాడుతూ కనిపించాయి. ఉడుత ఆత్రంగా చెట్టుమీదకు ఎక్కి కాయలను పండ్లతో కొరికింది. కేవలం దూది మాత్రమే పైకి వచ్చి గాలికి అటుఇటూ ఎగిరిపోయింది. ఉడుతకు చాలా నిరాశ కలిగింది.
పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అనుకునేవారి వల్ల సాధారణ మానవులకు పెద్దలాభమేమి ఉండదు. సెనగ మొక్కల వలె చిన్నగా కనిపించే మనుష్యులే ఉడుత కడుపు నిండిన విధంగా సాటివారి అవసరాలను, ఆపదలను తీర్చడానికి సదా సన్నద్ధులై ఉంటారు. ఇది తెలియని అమాయకులు పెద్ద వారేదో ఉద్ధరిస్తారని భ్రమపడుతుంటారు.
– ప్రజా పురాణం నుండి
యుగశక్తి గాయత్రి – Oct 2010