ఛత్రపతి శివాజీ మొగలాయిల సామ్రాజ్యాలపై ఆకస్మికంగా దాడులు చేస్తూ, యుద్ధం చేస్తున్న కాలం నాటి మాట. ఒకరోజు శివాజీ దాడి చేసి అలసిపోయి, ఒక వనవాసి వృద్ధురాలి నివాసానికి చేరుకొని, భోజనం పెట్టమని ప్రార్ధించాడు. ఆమె ప్రేమపూర్వకంగా కిచిడి తయారుచేసి వేడి వేడిగా శివాజీకి వడ్డించింది. అమిత ఆకలితోనున్న శివాజీ కిచిడీని తినాలనే తొందరలో వేడి కిచిడిలో చెయ్యి పెట్టాడు. దీనితో ఆయన చేతివేళ్ళు కాలాయి. దీనినంతా చూస్తున్న ఆ వృద్ధురాలు బాధపడుతూ ఇలా అన్నది. నీ చేష్టలు చూస్తుంటే శివాజీ మహరాజులా ఉన్నాయి. అలాగే నీ పనులు కూడా శివాజీ పనుల వలె మూర్ఖతతో కూడి ఉన్నాయి.ఈ మాటలు విన్న శివాజీ స్తబ్దుడైనాడు.
స్తబ్ధత నుండి తేరుకున్న శివాజీ వృద్ధురాలితో “నేను చేతివేళ్ళను కాల్చుకున్నందుకు మూర్ఖుడనన్నావు బాగుంది. కానీ శివాజీ ఎట్టి మూర్ఖపు పనులు చేశాడు?” అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా వృద్ధురాలు ఇలా అన్నది “నీవు అంచులందు చల్లగా ఉన్న కిచిడీలో చేయి పెట్టుటకు బదులు బాగా వేడిగానున్న మధ్యభాగాన వేళ్ళు పెట్టి కాల్చుకున్నావు. ఇట్టి మూర్టపు
పని శివాజీ కూడా చేస్తున్నాడు. ఆయన మొగల్ సామ్రాజ్య కేంద్రానికి దూరంగా ఉన్న చిన్న చిన్న కోటలను అవలీలగా జయించ వీలున్న చోట, వాటిని విడచిపెట్టి బలంగా ఉన్న పెద్ధ పెద్ద కోటలపై దాడికి ఉపక్రమిస్తూ ఓటమి పాలవుతున్నాడు. ” దీనిని విన్న శివాజీకి జ్ఞానోదయమైంది. రణనీతిలోగల తన తప్పు తెలిసి వచ్చింది. ఆ వృద్ధురాలికి శివాజీ ధన్యవాదాలు తెలిపి ఆమె నుండి సెలవు తీసికొన్నాడు. తదుపరి తన యుద్ధ తంత్రాన్ని తగిన రీతిగా తిరిగి రూపొందించుకొని, తొలుత చిన్న చిన్న కోటలను జయిస్తూ చివరకు పెద్ధ వానిని జయించుటలో సఫలత నొందుచూ సుస్థిర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
మారిన శివాజీ రణనీతి మన జీవన పోరులో కూడా ఆవశ్యం, అనుసరణీయం. తొలుత మనం చిన్న లక్ష్యాలు సాధిస్తూ తదుపరి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోగలం.
Source: అఖండజ్యోతి, సెప్టెంబర్ 2023