సమయం ఎప్పుడు ప్రవహించే ఒక అమూల్యమైన నిధి. ఎవరైతే ఈ నిధిని ఉపయోగించుకోగలుగుతారో, వారు సర్వోత్తమ లక్ష్యాన్ని సాధించగలరు. జీవితం ఒక భవంతి అయితే దానిలో ప్రతిగంట, ప్రతి నిమిషం ఇటుకలుగా ఉంటాయి. మనిషికి జీవితంపై ప్రేమ ఉంటే సమయం వృథా చేయకూడదు. వివేకవంతుడైన వాడు సాధ్యమయినంతగా సమయాన్ని మంచిగా ఉపయోగించి ఉన్నతి చెందుతాడు. బుద్ధిమంతులు తమ సమయాన్ని సదుపయోగపడే విధంగా విభజించుకుంటారు. ఆరోగ్యం కొరకు, సంపాదన కొరకు, కుటుంబ వ్యవహారాలకు, సామాజిక సత్మార్యాలకు సమయాన్ని తగు విధంగా వెచ్చించి అన్ని బాధ్యతలు సవ్యముగా జరిగేటట్లు చూసుకుంటారు. వ్యవస్థీకరించిన దినచర్య శారీరిక మానసిక ఆరోగ్యాలపై మంచి ప్రభావం చూపుతుంది. జీవనోపాధికి సమయం కేటాయించి, సవ్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్డించాలి. అదేవిధంగా ధనాన్ని మంచి పనుల కొరకు సదుపయోగం చేయాలి. సమయం చాలటం లేదు అనేది సరికాదు. చక్కగా ప్రణాళిక వేసుకుంటే అన్ని పనులకు సమయం ఉంటుంది. మానవుని అంతఃకరణలో మంచి-చెడు రెండు రకాల ప్రవృత్తులు ఉంటాయి. మంచి ప్రవృత్తులు జాగృతమైనప్పుడు వ్యక్తి మంచి పనులలో నిమగ్నమవుతాడు. కానీ మంచి ప్రవృత్తులు నిద్రిస్తుంటే చెడు ప్రవృత్తులు అనుచిత కార్యములు చేయుటకు ప్రేరేపిస్తాయి. ఆస్ట్రియా వంటి బలమైన దేశాన్ని నెపోలియన్ యుద్ధంలో ఓడించాడు. ఎందుచేతనంటే శత్రు సైనికులు యుద్ధంలోకి దిగటానికి ఐదు నిమిషాలు ఆలస్యం చేశారు. వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమికి ముఖ్యకారణం అతని సేనాపతి ఆలస్యంగా రావటమే. పనులు వాయిదా వేయటం, పనులను తప్పించుకునే ప్రయత్నం మంచిది కాదు. అవకాశం ఉన్నప్పుడే ప్రయత్నించాలి. అవకాశం పోయిన తరువాత ప్రయత్నిస్తానంటే ఏమి ఉపయోగం ఉంటుంది?
పనులను ఒక ప్రణాళిక చేసుకుని, టైంటేబుల్ వేసుకుని పూర్తి చేయాలి. ఆ విధంగా చేస్తే పనులన్నీ పూర్తి చేయగలుగు తాము. నిరాశ వారి దరికిచేరదు, అలసటకు లోనుగారు. సమయం యొక్కవిలువ తెలుసుకుని, సమయాన్ని సవ్యంగా వినియోగించుకుంటే జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించగలుగు తారు. పరీక్షలకు ముందునుంచే ప్రణాళికగా చదువుకుంటే పరీక్షల ముందు హడావిడి పడవలసిన అవసరం ఉండదు. సమయం యొక్కసదుపయోగమే సఫలతకు రహస్యం మనిషి సాఫల్యం కావాలంటే చాలా కష్టపడాలి. మంచి వ్యవసాయదారుడు సరియైన సమయంలో నాట్లు వేస్తే మిగిలిన పనులు సవ్యంగా జరుగుతాయి. పరీక్షలకు ముందు నుంచే చదువుకుంటుంటే చక్కగా పరీక్షలు వ్రాయగలుగుతారు. పరీక్షలు అయిపోయిన తరువాత చదువుతానంటే పరీక్షల కొరకు ఇంకొక సంవత్సరం ఆగాలి. జీవితంలో ప్రతిక్షణం మంచిదే. వాయిదాలు వేయడం మంచి పద్ధతి కాదు. సోమరితనం మనిషికి బద్ధశత్రువు. చేయవలసిన పనిని వెంటనే చేయాలి. రేపటి పని ఇవాళే, ఈ రోజు పని ఇప్పుడే చేయవచ్చు. మన వాతావరణం పనికి ప్రేరేపించేదిగా ఉంచుకోవాలి. పనికిరాని కబుర్లు చెప్పే స్నేహితులు నిజానికి శత్రువులతో సమానం. సమయాన్ని వృథా చేసుకుంటే తరువాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే ముందు వాయిదా వేసే గుణాన్ని వదుల్చుకోవాలి. అబ్రహం లింకన్ ఎంతలా సమయం పాటించేవారంటే ఆయన ఉదయాన నడకకు వెళ్ళడం చూసి గడియారాలు సరిచేసుకునే వారు. నిద్రలేవడం కానీ, నిద్ర పోవడం కానీ, భోజన సమయం ఇలా అన్నీ సమయానుసారం చేయడం వల్ల శరీరము, మనస్సు పనులకు సిద్ధంగా ఉంటాయి. తినడం, తాగడం, నిద్రలేవడం మొదలైన పనులు నిర్ణయించు కున్న సమయానికి చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఎక్కువ.
జిజ్ఞాస ఉండాలే కానీ చిన్న జీవుల నుండి కూడా పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు, సమయ సంయమం అన్ని ముఖ్యమైన పనులకు ఆధారం సమయ సంయమం. అనగా సమయాన్ని వీలయినంత ఎక్కువగా ఉపయోగించుకో గలగాలి. కొంచెం ప్లాను వేసుకుంటే అనేక పనులు ఒకేసారి చేసుకోవచ్చు. సమయం కలసి వస్తుంది. నాలుగు వస్తువుల కొరకు నాలుగుసార్లు బజారుకి వెళ్ళవచ్చు. కానీ కొంచెం ప్రణాళికగా ఉంటే నాలుగు వస్తువులు ఒకేసారి తెచ్చుకోవచ్చు. రోజు ఒక పద్ధతిగా కొంచం సేపు చదివినా మంచి సాఫల్యం సాధిస్తారు.
ఒక్కొక్కసారి టైం లేదనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి టైం నడవటం లేదనిపిస్తుంది. నెమ్మదిగా పోతుందనిపిస్తుంటుంది. కానీ సమయం ఎప్పుడు ఒకే వేగంతోనే పోతుంటుంది. చేసే పని ఇష్టంతో చేస్తే ఎంత సమయం గడచినా తెలియదు. చేస్తున్నా పని ఇష్టం లేకుండా చేస్తుంటే టైం గడవడంలేదనిపిస్తుంటుంది. క్షణములు యుగములుగా అవవచ్చు. యుగములు లక్షణములు కావచ్చు. చేస్తున్న పనిపై ఉన్న ఇష్టయిష్టాల మీద ఆధారపడి అటువంటి అనుభవాలు వస్తుంటాయి.
ఇబ్బందులు పనులు చేస్తున్నప్పుడు ఇబ్బందులు రావడం సహజం. వీటిలో కొన్ని శారీరికమైనవి, కొన్ని మానసికమైనవి, వీటిలో కొన్నింటిని తీసివేయగలుగుతాము, కొన్ని తీసివేయలేనివి ఉంటాయి.
మానసికమైన ఇబ్బందులు
పెద్ద మానసిక ఇబ్బంది ఏమంటే మన పనులను పరిస్థితులను ఇతరులు నియంత్రిస్తున్నారనే ఆలోచన. ఇది కొంతవరకు నిజం కావచ్చు, కానీ పూర్తిగా కాదు. మనం ఇతర వ్యక్తుల వలన, పరిస్థితుల వలన నియంత్రింపబడ కూడదు. మనం మన టైంటేబుల్ ప్రకారం నడుచుకోవాలి.
వాయిదా వేసే అలవాటు మానసికమైనది. పనులను వాయిదా వేయకూడదు. ప్రతి పని సకాలంలో పూర్తి చేయాలి. “రేపు” అనకూడదు. “బద్ధకస్తులకి పని ఎక్కువ” అనే వాక్యం గుర్తుపెట్టుకోవాలి. బద్ధకంతో పనులు పేరుకుపోతే వాటిని చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.
దీనికి విరుద్ధంగా పని పని అని ఆరాటపడేవారు (40%) ఉంటారు. అన్నీ పనులు ఒక రోజులో చేయాలను కుంటారు. దీని వలన మనుష్యులు అలసిపోతారు, కార్యదక్షత తగ్గిపోతుంది. పనులలో తప్పులు జరుగుతుంటాయి. పరిణామంగా మరురోజు తప్పులు సరిచేసుకోవడంలో సరిపోతుంది.
ఇంకా గుర్తుంచుకోవలసిది ఏమంటే చేపట్టే పనులు మన సామర్భ్యానుసారం ఉండాలి. పనిని బట్టి దానిని విభాగాలుగా చేసుకోవచ్చు. ప్రతి భాగానికి కొంత సమయం కేటాయించు కోవాలి.
మానసిక ఇబ్బందులలో భయం ఒకటి. దీనివలన ఏదో పోగొట్టుకుంటామని, కావలసినది పొందలేమని. చిన్న చిన్న విషయాల గురించి భయపడుతుంటారు. భయపడేవారు పెద్ద పెద్ద పనులు చేయలేరు. భయం వల్ల టెన్షన్ పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది.
ఈ భయాన్ని దాటగలగాలి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేయాలి. పనిని చక్కగా చేయడానికి ప్రయత్నించండి. “యోగః కర్మను కౌశలం” అంటే పనిని చక్కగా చేయడమే యోగం. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారోనని ఆలోచించవద్దు. అక్కరలేని, ఉపయోగపడని వస్తువులను దగ్గర ఉంచుకోకండి, బయటకు పంపించండి.
శారీరిక ఇబ్బందులు శారీరిక ఇబ్బందులలోకి మన కార్యక్షమత వస్తుంది. మనుష్యుల సామర్థ్యములు వేరువేరుగా ఉంటాయి. కొందరు 8 గంటలు కొందరు 10 గంటలు, కొందరు 12 గంటలు కొందరు 14 గంటలు పనిచేయగలుగుతారు. మన కార్యక్షమతను బట్టి టైం టేబుల్ వేసుకోవాలి. అందరు అన్ని పనులు చేయలేరు. మనం చేయగలిగిన పనిని ఎన్నుకోవాలి. కొందరు ఆఫీసు పని బాగా చేయగలిగితే, కొందరు ఎకౌంట్స్ పని బాగా చేస్తారు. కొందరు బాగా పాటలు పాడవచ్చు, కొందరు వంటలు బాగా చేయవచ్చు. మీ మీ అభిరుచి, మీరు ప్రత్యేకతల బట్టి ప్రణాళిక వేసుకోవాలి.
మానవ జీవితం మితమైనది కానీ చేయవలసిన పనులు అనంతం. పనులు వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి, సామాజికపరమైనవి ఉండవచ్చు. ఎటువంటి పనులు చేయవలెనో నిర్ధారించుకున్నా, నిర్ణయించుకున్న లక్ష్యం వైపు నిరంతరం క్రమక్రమంగా అడుగులు వేసుకుంటూ లక్ష్యం చేరవచ్చు. మంచి ప్రతిఫలం పొందవచ్చు. జీవితంలో పెద్ద పెద్ద అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని వదిలేసి పారిపోవలసిన పనిలేదు
యుగశక్తి గాయత్రి – మార్చి 2014