ఆ రోజులలో ఆమెరికాలోని తెల్లవారు ఆఫ్రికాలోని మనుష్యులను బానిసలుగా పట్టుకుని ఓడలు నింపి బజార్లో జంతువులను అమ్మినట్లు అమ్మేవారు. వారిని నాగలికి ఎడ్లను కట్టినట్టు కట్టి పొలం దున్నించేవారు. ఏదో రెండు ఎండు రొట్టెలను ఆహారంగా పడేసి రోజంతా కొడుతూ తిడుతూ కఠోరంగా పని చేయించేవారు. వీరి దయనీయ స్థితిని చూసి ఒక స్త్రీ హృదయం ద్రవించింది. ఎలాగైనా ఈ అనాచారాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నది. ఎన్నో ప్రయత్నాలు చేసి, విఫలమై చివరకు తన యావదాస్తిని అమ్మి బానిసలతో నిండిన ఓడను కొన్నది. వారందరికి వ్రాయటం, చదవటం, సంతకం చేయటం, సభ్యసమాజంలో వారిని తమ కాళ్ళ మీద తాము నిలబడి జీవించటం నేర్పింది. వారు సంపాదించిన సొమ్ము వారి ఔన్నత్యం కొరకే ఖర్చు చేసేటట్లు ఏర్పాట్లు చేసింది. తెల్లజాతికి చెందిన ఈ మహిళ పేరు ఫిలిప్ హ్విటలే. ఆమె విద్యాలయంలో చదువుకున్నవారు, ఆమె కర్మాగారంలో పని చేసిన వారు చాలమంది బానిసత్వ నిర్మూలనకు ఆందోళనలు చేశారు.
ఈ విధమైన కొత్త ఆదర్శాలను చూసేసరికి అనేకమందికి క్రొత్త రీతిలో ఆలోచించే అవకాశం లభించింది. బానిసత్వ నిర్మూలనకు తగిన వాతావరణం ఏర్పడింది. అప్పటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఆ మహిళను పలువిధాల ప్రశంసించాడు.
– ప్రజ్ఞా పురాణం నుండి
యుగశక్తి గాయత్రి – Oct 2010