మదన మోహన మాళవీయ పేద కుటుంబములో జన్మించి కష్టపడి బి.యే. పరీక్షలో ఉత్తీర్ణుడై 50 రూపాయల నెల జీతంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేరు. ఈ స్వల్పవేతనం నుండియే కొంత డబ్బును ఆదాచేసి పేద విద్యార్ధులకు ఖర్చుచేశారు. విధి నిర్వహణానంతరం ఆదాచేయగల్గిన సమయాన్ని కూడా లోక సేవకై వినియోగించేవారు. ఇంతేగాక రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలలో వారు చూపే ప్రతిభ, చెప్పే ఉపన్యాసాలు అద్భుతంగా ఉండేవి. అద్వితీయమైన ఈ పాత్రను చూచి ముగ్ధుడై రాజా కాలాకకర్ అత్యంత ప్రభావితుడై, హిందుస్థాన్ వారపత్రికకు సంపాదకుణ్ణి చేస్తాడు. 50 రూపాయల నెల వేతనం 200 రూకు పెరిగింది. కానీ పెరిగిన నాల్గురెట్ల జీతం మాళవీయుని అక్కడ ఎక్కువ కాలం ఉండనీయలేదు.
రాజా కాలాకకర్ కి త్రాగే అలవాటున్నది. అందుకే పదవిని, పెద్దవేతనాన్ని వదలి వేసి మాళవీయ బెనారస్ వెళ్ళి వకీలు పరీక్షకు చదవసాగేరు. ఈయన దీక్ష అనతికాలంలోనే ఈయనను గొప్ప వకీలును చేసింది, కాని కాలం యొక్క పిలుపు విని ఈయన నిశ్చింతగా ఉండలేక పోయాడు. వీలైనంత ఎక్కువ కాలాన్ని రాష్ట్రీయ కార్యక్రమాలకు వినియోగించసాగేరు. జనుల హృదయాలపై ఆయన ప్రభావం చాలా ఎక్కువగా పడసాగింది. ఫలితంగా కేంద్ర వ్యవస్థాపనకు సదస్యునిగా ఎన్నుకోబడ్డారు. పూర్తి సమయం, కార్యక్రమాలకై వినియోగింపబడింది. ‘అభ్యుదయం’ అనే వారపత్రిక, ‘మర్యాద’ అనే మాసపత్రిక ప్రచురణను ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి పునాది వేసింది. కూడా వీరే. కాంగ్రెస్ ఆందోళన ద్వారా జైళ్ళలో మగ్గుతూకూడా వీరు చూపిన ప్రతిభ అసాధారణమైనది. ఇంతటి ప్రతిభావంతుడు ఎంతటి వినమ్రుడు చూస్తే చాలా ఆశ్చర్యం కల్గిస్తుంది. కలకత్తా విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు పదవిని ప్రదానం చేయాలని, ప్రభుత్వం “సర్” గా సన్మానించాలని పండితసభ “పండితరాజా” అనే బిరుదు ఇవ్వాలని ఆకాంక్షను వ్యక్తం చేసినపుడు వీరు నిరాకరిస్తూ ప్రస్తుతం ఉన్న “పండిత” బిరుదు నొక్కదాన్ని సద్వినియోగం చేయగల్గితే చాలునని అభిమానులకు చేతులెత్తి నమస్కరించారు. నిరాడంబరుడుగా, కర్మయోగిగా, మితవ్యయంతో, ఔదార్యంతో వీరి యొక్క వ్యక్తిగత జీవితం నిండి ఉండటం వల్ల సాధారణమైన ఈయన అసామాన్యుడుగా అసంఖ్యాకులకు ప్రేరణనిచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయారు.
Source: *యుగశక్తి గాయత్రి November 2020*