*సువతి కర్మణి లోకం ప్రేరయతీతి సూర్యః*
సూర్యుడు సృష్టికి ప్రాణంగా చెప్పబడింది. సూర్యుని వల్లే పృధ్విపై జీవం ఉన్నది. సూర్యనారాయణుడు ఒక్కరోజు రాకపోతే పృధ్విపై గందరగోళం ఏర్పడుతుంది. సూర్యుని ప్రకాశం సమస్త జీవరాశులలో ఉల్లాసాన్ని, ప్రాణాన్ని ఇస్తుంది. అందుకే సూర్యునికి ఇంత మహత్వం ఇవ్వబడింది. సూర్యుడు హైడ్రోజన్ హీలియం పరస్పర ప్రక్రియవల్ల ప్రచండ అగ్ని జ్వాలలతో, శక్తిధారలతో మండే అగ్నిగోళం మాత్రమే కాదు, అది సూర్యుని ఆదిభౌతిక స్వరూపం.
ఆదిదైవిక రూపంలో ఆలోచనలను నియంత్రిస్తాడు, గ్రహాల అధిపతి, భావాలకు అందమైన ప్రేరణ ఇస్తాడు, జాతకంలో ఆత్మగా వెలుగొందుతాడు. ఇంకా లోతులలోకి వెళ్తే ఆధ్యాత్మిక రూపంలో ఆయన విరాట్పురుషుని జ్యోతి. సుందరమైన ప్రేరణలు ఎవరు ఇస్తారో అతడే సూర్యుడు.
సూర్యుని ఉపాసన భారతీయ సంస్కృతి యొక్క ఆధ్యాత్మిక పక్ష మూలమర్మం. ఆదిత్య హృదయం యొక్క రహస్యం తెలుసుకున్న తరువాతే శ్రీరాముని ద్వారా రావణవధ సంభవమయింది. పంచపాండవులు ధౌమ్యుముని అందించిన సూర్యోపాసన ద్వారానే అజేయులయ్యే శక్తిని ప్రాప్తించుకున్నారు. సూర్యుని స్తుతితో ఆర్ష వాజ్ఞయం నిండి ఉన్నది. ఋగ్వేదమండలి పంచమ మండలం యొక్క 81వ సూక్తంలోని మొదటి శ్లోకంలో “మహీ దేవస్య సవితుః పరిస్తుతిః” అనగా సవితాదేవత యొక్క విస్తారమైన స్తుతి మహత్తరమైనదని అర్థం. సూర్యుడే సవితా. తన సృజనాత్మక, ప్రకాశవంతమైన దివ్యమైన సౌరశక్తి రూపంలో మానవ మాత్రుని పోషించి విశ్వవ్యాప్తిగా చేసేదే సవితా. పాపనాశనం చేసే గాయత్రి యొక్క దేవత సవిత.
*యుగశక్తి గాయత్రి – Sept 2010*