Home Telugu కష్టం లేనిదే సుఖం లేదు

కష్టం లేనిదే సుఖం లేదు

by

Loading

జీవితంలో ఏ శిఖరాన్ని అధిరోహించాలన్నా కొంత కష్టాన్ని కొంతనష్టాన్ని భరించక తప్పదు. కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఇష్టాన్ని చూపించకపోతే సుఖాన్ని పొందలేం. అనుకున్నది సాధించలేం. విజయాన్ని పొందిన తర్వాత మొదట్లో పడిన కష్టాన్ని పూర్తిగా మరచిపోతాం. ఇది లోక సహజం. జీవితరహస్యం.

ఉదాహరణకు మీకు ఒక చిన్న చెల్లాయో, తమ్ముడో కావాలనిఉంటుంది. లేచిన దగ్గర నుండి దేవునికి మనస్సులోనే మొక్కుకుంటూ ఉంటారు. మీ అమ్మంటే మీకు చాలా ఇష్టం.ఆమె కష్టపడితే మీకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మీకు చెల్లాయినీ, తమ్ముడినో ఇవ్వాలంటే అమ్మ చాలా కష్టపడుతుందని తెలుసు. ఒక్క బిడ్డను ఇవ్వాలంటే అమ్మ ఎంత కష్టపడుతుందో టి.వి.ల్లో, సినిమాల్లో చూస్తూనే ఉంటారు. అమ్మ ఏడిస్తే మీరు ఏడుస్తారు. అయినా మీ కోరిక చావదు. చెల్లాయి చేతికి వచ్చాక కలిగే ఆనందాన్నే ఊహించుకుంటారు. దాన్నే కోరుకుంటారు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తున్నది? కష్టం లేనిదే సుఖం లేదు అని కదా!

కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటేనే జీవితం సఫలం అవుతుంది. ఒక రకం పక్షిజాతిలో తల్లి గూడుకట్టి పిల్లల్ని పొదుగుతుంది. వాటికి కావలసిన ఆహారాన్ని బయటి నుండి తెచ్చి పెడుతుంది. సుఖాన్ని మరిగిన పిల్లలు హాయిగా గూట్లోనే నిద్రపోతూఉంటాయి. ఈ విషయాన్ని తల్లి గమనిస్తుంది. చిన్న చిన్న ముళ్లు తెచ్చి పిల్లల పొట్ట కింది పెడుతుంది. కదిలినప్పుడల్లా అవి గుచ్చుకోవడం మొదలుపెడతాయి. ఆ బాధను భరించలేక పిల్లలు రెక్కలు ఆడిస్తూ పైకి ఎగరడానికి ప్రయత్నిస్తాయి. మెల్లమెల్లగా పైకి ఎగిరిపోతాయి. అప్పుడు తెలుస్తాయి ఆ పిల్లలకి కష్టంలోని విలువ, రెక్కల యొక్క అవసరం. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తోంది? ముల్లు వల్ల అనుభవించిన కొద్దిపాటి కష్టమే స్వతంత్రంగా, హాయిగా జీవించడానికి ఉపయోగించింది అనేకదా!

జీవితంలో కొద్దో గొప్పో కష్టాలు అనుభవిస్తేనే దైవస్మరణమీదకు మనస్సు మళ్లుతుంది. అప్పుడే పాపభీతి కలుగుతుంది. తప్పుడు పనులు చెయ్యం. మంచి పనులను ఎంచుకుంటూ ఉంటాం. అందువల్ల మరికొందరికి లాభం చేకూరుతుంది. దానితో కొంతమందికి ఆదర్శం అవుతాం. ఆదర్శ జీవితంవల్ల ఆనందం వెల్లివిరుస్తుంది. అందువల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఏవగించుకోకూడదు. వాటిని ఇష్టాలుగా మార్చుకుని జీవించడంలోనే జీవిత పరమార్ధం దాగి ఉంది. కష్టం లేకుండా సుఖాలు కావాలనుకోవడం మూర్ధత్వమే అవుతుంది.

బాలలూ! భవిష్యత్తును బంగారు బాటలో నడిపించాలంటే మీరు ముందుగా కష్టపడక తప్పదు. ఉదాహరణకు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలంటే ముందుగా కష్టపడి చదవాలి. ఏదైనా వృత్తి విద్యలో నైపుణ్యం సంపాదించాలంటే ముందుగా కష్టపడి నేర్చుకోవాలి. తర్వాత దానిలో సాధన చేయాలి. దైవసాన్నిధ్యాన్ని పొందాలి అంటే ముందుగా కఠినంగా సాధన చేయాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందాలి అంటే ముందుగా కష్టాలను ఎదుర్కొంటూ ఇష్టంతో సమాజానికి సేవ చేయాలి. తర్వాత తరతమ భేదాలను మరచి స్వచ్చందంగా అన్ని రంగాలలో పాల్గొనాలి. గతంలో పైకి వచ్చిన వారంతా కష్టాలను ఎదుర్శొన్నవారే. వారి సాధనలో ఎదురైన కష్టాలను ఇష్టాలుగా మార్చుకున్నవారే.

తల్లిని కష్టపెట్టి తాను ఏడుస్తూ శిశువు ఈ లోకంలోకి వస్తాడు. వెళ్లిపోయేనాడు తన చుట్టూ ఉన్నవారిని ఏడిపిస్తూ వెళ్ళిపోతాడు. దీనిని బట్టి జీవి యొక్క ఆద్యంతాలు కష్టంతోనే నిండి ఉన్నాయని తెలుస్తోంది. అదే కష్టాన్ని మనం ఇష్టంగా చేసుకుని జీవించాలి. అదే అధ్యాత్మతత్వం కూడా.

కం॥। కష్టపడుచునుండ మిగుల

ఇష్టంబు గలుగును దాని నెరుగగవలయున్‌

కష్టమునకు వెరువ వలదు

కష్టపడిన చోట కీర్తిగనుమో బాలా!

Source: యుగశక్తి గాయత్రి, జనవరి 2011.

You may also like