Home great personalities నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి ప్రత్యేకం

నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి ప్రత్యేకం

by

Loading

ఆయన గదిలో అడుగుపెట్టగానే ఆ ఆంగ్ల అధికారి నివ్వెరబోయాడు. విప్పారిన కళ్ళతో గదిని పరిశీలించాడు. చాలా సాధారణమైన గది, ఏ విధమైన అలంకరణ లేదు. నేలమీద పరచి ఉన్న ఒక చాప మీద ఆయన కూర్చుని ఉన్నాడు. పక్కన కొన్ని పుస్తకాలున్నాయి. వ్రాయడానికి ఒక పీట, దాని మీద కొన్ని కాగితాలు, పక్కనే కలము. చేతిలో ఒక పుస్తకం ఉంది. చూడబోతే అది వివేకానందులవారి సందేశాల సంకలనంలా అనిపించింది. అది తమ శిష్యులకు, మిత్రులకు, గురుభాయీలకు అప్పుడప్పుడు వ్రాసినది. ఆ రచనల్లో దేశప్రేమ అనే నిప్పు శ్రోతల హృదయాలను రగల్చక మానదు. స్వామివారి ఓజస్వీ ఆలోచనలు ఆయనకు, ఆయన లాంటి అనేక ఇతర దేశభక్తులకు ప్రేరణ కలిగిస్తాయి. గదిలోని ఇంకో మూల త్రాగేనీటి కుండ ఉంది. ఎదురుగా ఉన్న గోడ దగ్గరున్న వేదిక మీద పూల మధ్యలో ఒక వెండి డబ్బా ఉంది. అది పూజావేదిక లాగా అనిపిస్తోంది. దాని దగ్గరే ఒక చిన్న ఆసనం కూడా పరిచి ఉంది. దాని మీదే కూర్చుని పూజ, ధ్యానాలు చేస్తారు కాబోలు. ఇవి మాత్రమే ఉన్నఆ గదిని ఆంగ్ల అధికారి చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తను కూర్చోడానికి గదిలో కుర్చీ లాంటిదేమీ లేదు. నిల్చుని ఉండడమే నయం అనుకున్న ఆ అధికారి, “మిస్టర్‌ సుభాష్‌! మిమ్మల్ని ఖైదు చేసేందుకు నా దగ్గర వారెంట్‌ ఉంది.” విచిత్రమైనభావంతో కొనసాగించాడు – “ఎలా ఉండాల్సిన వాడివి, ఎలా ఉన్నావు?”సుభాష్‌ చంద్రబోస్‌ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పట్నుంచి ఈ అధికారి పరిచయమే.

20 సెప్టెంబర్‌, 1920 నాడు సుభాష్‌ ఐ.సి.ఎస్‌ పరీక్ష పాసైనరోజు ఇతనికి ఇంకా గుర్తు. పాసైన వారిలో సుభాష్‌ స్థానం నాలుగోది. ఆంగ్లంలో ప్రథమంగా నిలిచారు. ఆంగ్రేయులను వారి భాషలోనే మట్టికరిపించారు. వార్తాపత్రికల్లో దీనిగురించి చాలా చర్చ కొనసాగింది. కొన్నాళ్ళకే వార్తాపత్రికల్లో ముద్రించిన ముఖ్య సమాచారం, ఐ.సి.ఎస్‌ పదవికి రాజీనామా ఇచ్చిన సుభాష్‌. 22 ఏప్రిల్‌, 1921. ఈరోజు భారతీయచరిత్రలో తిరిగి రాయలేనిది. ఈ అధికారికి తెలుసు, ఆయన గనక ఆ రోజు రాజీనామా చేయకపోతే తప్పకుండా ఇప్పుడుతాను అయన క్రింద ఉద్యోగిగా ఉంటూ, సలాము కొట్టి, అప్పగించిన పనిని చేయవలసి ఉండేది; కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అందుకే, “ఎలా ఉండాల్సినవాడివి, ఎలా ఉన్నావు” అన్నాడతను. దానికి నవ్వుతూ జవాబుగా సుభాష్‌ “సరిగ్గా చెప్పారు మిస్టర్‌ గ్రిఫిథ్‌! నేను నౌకరుగా ఉండేవాడిని, కాని ఇప్పుడు నా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సైనికుడిని.” అన్నారు. ఆ జవాబుకి విసుగెత్తిపోయిన అధికారి ఆ విసుగుతోనే, “నేను ఇప్పుడే అరెస్ట్‌ చేయాలి.” అన్నాడు. మళ్ళీ నవ్వుతూ సుభాష్‌ అన్నాడు “తప్పకుండా. నీకు అప్పగించిన పని నువ్వు చేయి.” అప్పుడు అధికారి, “నీ గదిని వెతకాలి” అన్నాడు గంభీరంగా. “ఓ తప్పకుండా” అని మళ్ళీ నవ్వుతూ జవాబిచ్చారు. జరుగుతున్న దానికి, జరగబోయేదానికి ఏమాత్రం చింతలేకుండా, నిశ్చింతగా ఉంది ఆయన నవ్వు, మాట.

ఆంగ్ల అధికారి గ్రిఫిథ్‌ చాలా జాగ్రత్తగా గదిలోని వస్తువులను పరీక్షించసాగాడు. పుస్తకాలు, కాగితాల్లో అనుమానాస్పదంగా ఏదీ దొరకలేదు. తరువాత వేదికపై ఉన్న వెండిడబ్బా తీస్తే అందులో చూర్ణం లాంటిదేదో ఉంది. “ఇదేంటి మిస్టర్‌ సుభాష్‌ అడిగాడతను. “ఇది మా దేశపు మట్టి మిస్టర్‌గ్రిఫిథ్‌” అభిమానంతో వచ్చింది జవాబు. “కానీ ఇక్కడ దీనిని ఇలా పూలతో అలంకరించి ఉంచడంలో ఆంతర్యం ఏంటి?” ఆత్రుతగా అడిగిన ఆ ప్రశ్నకు సుభాష్‌ ఇలా అన్నాడు. “నేను నా దేశపు మట్టిని రోజు పూజిస్తాను. స్వాతంత్ర్యం అనే నా లక్ష్యాన్ని స్మరిస్తూ ఉంటాను.” ఈ జవాబు ఆ అధికారికి ఏమాత్రం అర్ధం కాలేదు. “మిస్టర్‌ సుభాష్‌! నీకు ఖచ్చితంగా పిచ్చిపట్టింది. లేకపోతే మట్టిని ఎవరైనా పూజిస్తారా?” అన్నాడు. దానికి మళ్ళీ నవ్వుతూ, “ఇది నీకు అర్థం కాదు. నువ్వు ఇంగ్లాండ్‌లో పుట్టావు. భారత దేశంలో పుట్టుంటే తల్లి విలువ, మాతృభూమి విలువ తెలిసేది. నువ్వు మట్టి అంటున్న ఆ వస్తువు నా మాతృభూమి పాదధూళి. నేను రోజు దీనిని పూజిస్తాను, నా నుదిటిపై పెట్టుకుంటాను. ఈ విషయాలన్నీ నువ్వు అర్ధం చేసుకోలేవు. నీకు అప్పగించిన పని చేయి.” సరేనంటూ సుభాష్‌కు సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నా ఆయన ముఖంలో మందహాసమే ఉండడం చూసి అధికారి విస్తుబోయాడు. ఇన్నాళ్ళల్లో ఇలా బంధించుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు మనుషులు కలవరపడడమే చూశాడు కానీ ఇలా ప్రసన్నంగా, ఏ చింతా లేకుండా ఉన్నవారు ఎవరూ లేరు. “ఇలా అరెస్ట్‌ అయినందుకు నీకేమాత్రం బాధ లేదా మిస్టర్‌ సుభాష్‌ అన్న అధికారిని చూసి, “కష్టం, త్యాగం – ఈ రెండు స్వాతంత్ర్యానికి పునాదులు. వీటి ఆధారంగానే మా స్వతంత్ర,సశక్త దేశం నిర్మించబడుతుంది. దేశంలోని యువత అందుకు తమని తాము అర్పించుకోడానికి సిద్ధమైనప్పుడు స్వతంత్రమనే కల నిజమవడానికి ఎంతో కాలం పట్టదు.” అంటూ సుభాష్‌ మాటలు, చెప్పిన విధానం, వాణిలో దాగున్న సాహసం గ్రిఫిథ్‌ వెన్నును వణికించింది. ఈ మనిషి నిజంగా గొప్పవాడు, ఇదే పరిస్థితి కొనసాగితే మా ఆంగ్రేయులంతా భారతదేశం వదిలి వెళ్ళాల్సిందే అని మనసులోనే అనుకున్నాడు అతను. ఆ తరువాత రహస్యంగా సుభాష్‌ను బర్మాలోని మాండలే జైలుకి తరలించారు.

లాలాలజపతిరాయ్‌, భగత్‌సింగ్‌ బాబాయి సర్దార్‌ అజిత్‌ సింహ్‌, లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వంటి గొప్ప దేశభక్తుల కఠోర తపస్సుకు సాక్షిగా నిలిచిన జైలుఅది. క్రాంతికారుల పుణ్యతపోభూమికి చేరుకుని సుభాష్‌ చాలా ఆనందించారు. మహర్షి అరవిందోగారి ప్రియశిష్యుడు, తన సహపాఠి, మిత్రుడు అయిన దిలీప్‌కుమార్‌ రాయ్‌కు 2 మే, 1925న సుభాష్‌ తన హృదయ భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ రాసినఉత్తరం, “ఇక్కడ ఉండడం వల్ల నా ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఈ జైలు వాతావరణం నాలో దార్శనిక ఆలోచనలు కలిగిస్తోంది. జీవితం గురించి నేనిక్కడ నేర్చుకున్నది, చదివిన దర్శనాలు నాకు చాలా లాభదాయకమైనవి. ఆరోగ్యమైన వ్యక్తికి ఆలోచించే సమయం ఉంటే ఇక్కడ కష్టాలు కూడా సుఖంగా అనిపిస్తాయి.ఈ జైలు గోడల లోపలే లోకమాన్యుడు గీతారహస్యాన్ని రచించారు. చేతులకు బేడీలున్నా వ్రాస్తున్నప్పుడు ఆయన ఆత్మలో ఆనందం, పరమశాంతి ఖచ్చితంగా ఉన్నాయి. అటువంటి గొప్ప దేశభక్తుల అడుగుజాడలలో నడుస్తున్నాననే ఆలోచనే నాలో గౌరవాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ జైల్లో నాకు ఆత్మశాంతి లభిస్తుందని నా నమ్మకం.” నిజంగానే మాండలే జైలు ఆయనకు తపోభూమిగా మారింది. అక్కడ ఆయన ఆత్మవిశ్లేషణ చేసుకున్నారు, ఆలోచనలు, జీవితాన్ని సరిదిద్దుకున్నారు. ఏదో ఈశ్వరీయ శక్తి అంతరిక్షం నుండి ఆయనలో అవతరిస్తున్నట్టు అనుభూతి చెందారు. జైల్లో కష్టాలు ఆయన సాధనలుగా మారాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఆయనలో క్రొత్త వ్యక్తిత్వం నిర్మాణం కాసాగింది. ఆయన అందరి ప్రియతమ సేనాని, మహా నాయకుడు, నేతాజీ అయ్యారు. దేశశిల్సి, నైపుణ్యం గల యోధుడు, ఆలోచనాపరుడు, రచయిత రూపంలో ప్రజలు ఆయనలో మార్గదర్శకుడిని చూడ సాగారు. భారతీయ యువత ఆయనతో, *“దేశమంతా చీకటిలో మునిగిపోయిన ఈ విపత్కర పరిస్థితుల్లో మీ వ్యక్తిత్వం మాకు ప్రకాశస్తంభంగా నిలిచింది”* అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఇది కాలానుగుణమైన తథ్యం. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేటికీ దేశప్రజలకు ప్రేరణ, ప్రకాశపుంజం.

– అఖండజ్యోతి, జనవరి 2016

అనువాదం – జయలక్ష్మి

యుగశక్తి గాయత్రి – జనవరి 2017

You may also like